మంత్రులతో విజయోత్సాహం.. పలాస-కాశీబుగ్గ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ!
పలాస, సూర్య : ఇటీవల జరిగిన పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నూతన చైర్మన్, కౌన్సిలర్లు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ముందుగా నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం వాహన శ్రేణులతో వెళ్లి మంత్రులను, జిల్లా పార్టీ అధ్యక్ష, కార్యదర్శులను కలిశారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించిన ప్రజల ఆదరణ, నమ్మకం గురించి మంత్రులకు వివరించారు. ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మంత్రులు నూతన ప్రజాప్రతినిధులతో ఆత్మీయంగా మాట్లాడి, విజయానికి దోహదపడిన అంశాలను సమీక్షించారు. ప్రజలు కూటమిపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాధాన్యతా అంశాలు, కార్యాచరణ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు.ఓట్ల ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ, అభివృద్ధి విషయంలో మాత్రం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా సమష్టిగా కృషి చేయాలని మంత్రులు సూచించారు. పలాస-కాశీబుగ్గను రాష్ట్రంలోనే అత్యంత సుందరమైన, ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తూ మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రజల ఆశీర్వాదంతో సాధించిన విజయాన్ని బాధ్యతగా భావించి, మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని నూతన ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి,ఏపి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ వజ్జ బాబురావు, నూతన మున్సిపల్ చైర్మన్ గంగాభవానితో పాటు నూతన కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.