మంత్రి నారా లోకేష్ చొరవతో రూ. 68.73 కోట్లు డ్రైనేజీ పనులు.
మంత్రి నారా లోకేష్ చొరవతో
రూ.68.73 కోట్ల డ్రైనేజీ పనులు
భారీ వర్షాల ముప్పు నుంచి మంగళగిరి–తాడేపల్లి నగరానికి శాశ్వత రక్షణ
రూ.68.73 కోట్లతో సమగ్ర స్టార్మ్‌వాటర్ డ్రైనేజీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
భారీ వర్షాల సమయంలో మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో వరద నీటి నిల్వలు, రహదారులపై నీటి ప్రవాహం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి నారా లోకేష్ చొరవతో రూ.68.73 కోట్లతో సమగ్ర స్టార్మ్‌వాటర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.
ఈ ప్రాజెక్టులో మంగళగిరి డివిజన్‌లో రూ.33 కోట్లతో 26 పనులు, తాడేపల్లి డివిజన్‌లో రూ.35.73 కోట్లతో 11 పనులు కలిపి మొత్తం 37 కీలక డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు. కొత్త డ్రైన్ల నిర్మాణంతో పాటు ఇప్పటికే ఉన్న డ్రైన్లను బలోపేతం చేయడం, అవసరమైన చోట్ల వెడల్పు చేయడం, ప్రత్యామ్నాయ డ్రైన్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు.మంగళగిరి ప్రాంతంలో రత్నాల చెరువు, ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి ప్రాంతం, బాపనయ్యనగర్, మార్కండేయ కాలనీ, ఈద్గా వెనుక ప్రాంతం, బాప్టిస్ట్‌పేట, కాజా, చినకాకాని తదితర ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే జాతీయ రహదారి సర్వీస్ రోడ్, వడ్డేశ్వరం, కొలనుకొండ నుంచి ఇప్పటం వరకు వర్షపు నీటిని సక్రమంగా మళ్లించేలా డ్రైనేజీ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
తాడేపల్లి ప్రాంతంలో హెచ్‌పీ పెట్రోల్ బంక్ సర్వీస్ రోడ్, ఉండవల్లి సెంటర్ నుంచి నులకపేట, నులకపేట నుంచి డాన్‌బాస్కో పాఠశాల వరకు అవసరమైన డ్రైనేజీ నిర్మాణ, అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాటర్‌బాడీలను డ్రైనేజీ వ్యవస్థతో అనుసంధానం చేయడం, స్పాంజ్ జోన్లు, డిటెన్షన్ పాండ్లు, బ్లూ–గ్రీన్ మౌలిక వసతులు, ఇంజెక్షన్ బోర్ల ఏర్పాటు వంటి ఆధునిక వరద నిర్వహణ చర్యలు కూడా చేపట్టనున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, రహదారులపై వరద నీరు ప్రవహించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం వంటి సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా భవిష్యత్ వర్షపు నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ సమగ్ర ప్రణాళిక పూర్తయితే మంగళగిరి–తాడేపల్లి నగరంలో వర్షపు నీటి నిర్వహణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. మంత్రి నారా లోకేష్ చొరవతో మంజూరైన ఈ ప్రాజెక్టు నగర సమగ్ర అభివృద్ధిలో మరో కీలక ముందడుగుగా నిలవనుంది.