BREAKING
అటవీ అమరవీరుల త్యాగం సిరస్మరణీయం ప్రతిరోజూ ఉదయం సోంపు వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య రహస్యాలు మీకోసమే! పాత కొమ్ముగూడెంలో పలు నిర్మాణ పనులకు శ్రీకారం చలికాలంలో ఈ ఏడు పొరపాట్లు అస్సలు చేయకండి.. చిన్న నిర్లక్ష్యమే పెద్ద అనారోగ్యానికి దారితీస్తుంది! ప్రతి రోజు ఒక గ్లాసు పసుపు పాలు తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకోసమే! బిక్కవోలు జనసేనకు 100% విజయం 400 క్వింటాల సబ్సిడీ సెనగ ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ఏజ్-చెక్: గ్లోబల్ విస్తరణ మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ. జాతీయ లోక అదాలత్ ను జయప్రదం చేయాలి అండాల సేకరణ అక్రమ దందాపై సర్కారు ఉక్కుపాదం తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు నజీబ్ రజాక్ గృహ నిర్బంధానికి కోర్టు అనుమతి: మలేషియాలో సంచలనం ప్రవచన మండపం ముందు భవనం ఎత్తు పెంపు కేటీఆర్‌నుమర్యాదపూర్వకంగా కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

మేజర్ సర్పంచ్ పీఠంపై ఆశావహుల కన్ను..!

Select Suryaa Now
మేజర్ సర్పంచ్ పీఠంపై ఆశావహుల కన్ను..!

నరసన్నపేట, సూర్య : మేజర్ పంచాయతీ సర్పంచ్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీకి చెందిన ఆశావహ నేతలు ఇప్పటి నుంచే ప్రచారానికి తెరలేపారు. నరసన్నపేటను అభివృద్ధి పథంలో నడిపిస్తామని, అవినీతి రహిత పాలన అందిస్తామని, పట్టణంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను వేదికగా చేసుకొని ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వందలాది సందేశాలు, ప్రచార వీడియోలు, ఆడియో రికార్డులతో హోరెత్తిస్తున్నారు.

సుమారు పది మంది వరకు ఆశావహులు సర్పంచ్ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మహిళల పేర్లను తెరపైకి తీసుకువస్తూ, వారి తరఫున కొంతమంది అనుచరులను ప్రత్యేకంగా రంగంలోకి దించి వాట్సాప్ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థి తామేనంటూ ఎవరికి వారు సంకేతాలు ఇస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూల ఫలితాలు రావడంతో సర్పంచ్ పీఠం కూడా తమకే దక్కుతుందనే ఆశతో పలువురు నేతలు ముందస్తు ప్రచారానికి దిగుతున్నారు.

అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నరసన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూడాల్సి ఉండగా, ఆశావహులు మాత్రం తమదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా సర్పంచ్ ఎన్నికల రేసులో వెనుకడుగు వేయడం లేదు. అధికార పార్టీ నిర్ణయం కోసం వేచి చూడకుండా ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించింది. పట్టణ సమస్యలను పరిష్కరిస్తామని, మేజర్ పంచాయతీకి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ప్రజలకు హామీలు ఇస్తోంది. దీంతో నరసన్నపేటలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది.

### ప్రచార హామీలు సరే.. పట్టణ సమస్యల సంగతేంటి?

మరోవైపు రాజకీయ పార్టీల ప్రచార హోరు ఒకవైపు కొనసాగుతుంటే, పట్టణ ప్రజలు మాత్రం కనీస సౌకర్యాల కోసం ఎదురుచూస్తున్నారు. పంచాయతీ పరిధిలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, రహదారుల అభివృద్ధి వంటి కనీస అవసరాలు సైతం పూర్తిస్థాయిలో అందడం లేదనే అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతోంది. పట్టణంలోని చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని, అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూరగాయల మార్కెట్ అభివృద్ధి కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి సోమవారం జరిగే వారపు సంత ప్రాంతం ఆక్రమణలతో కుదించుకుపోతోంది. దేశవానిపేట నుంచి సత్యవరం వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఆక్రమణలు పెరిగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు కళాశాలకు వెళ్లేందుకు ఉపయోగపడిన రహదారి సైతం ఆక్రమణల కారణంగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.

పట్టణంలో పేరుకుపోతున్న సమస్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఎన్నికల సమయంలో అభివృద్ధి హామీలు గుప్పించే నాయకులు, అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత వాటి అమలుపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

# కొత్త పాలకవర్గం ఏం చేస్తుంది?

నరసన్నపేట అభివృద్ధి విషయంలో రాజకీయ నాయకుల హామీలకు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు మధ్య ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. వాట్సాప్ ప్రచారంలో అభివృద్ధి మాటలు మారుమోగుతున్నా, పట్టణంలో మాత్రం మౌలిక వసతుల కొరత ప్రజలను వెంటాడుతోంది. సర్పంచ్ పీఠం కోసం పోటీ పడుతున్న ఆశావహులు ముందుగా పట్టణ సమస్యలపై తమ కార్యాచరణను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మాటలతో కాకుండా చేతల్లో అభివృద్ధి చూపించే నాయకత్వం కోసం నరసన్నపేట ప్రజలు ఎదురుచూస్తున్నారు. త్వరలో ఏర్పడనున్న నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం పట్టణ సమస్యలకు పరిష్కారం చూపి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందా? లేక ఇప్పటికే ఉన్న సమస్యలను మరింత జటిలం చేస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే!