andhrapradesh
మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలి
నగరం, మేజర్ న్యూస్:
రైతులు సాగు ఖర్చు తగ్గించుకుని, సొంతంగా ఎరువులు తయారు చేసుకుని, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. బుధవారం మండల పరిధిలోని చినమట్లపూడిలో ఆత్మ తరుపున సమీకృత వ్యవసాయ విధానం, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ అచ్చుతరాజు మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ వంటి పంటలు వేసి నేల సారాన్ని పెంచుకోవాలని, జీవన ఎరువులైన అజోస్పైరిల్లమ్, పి ఎస్ బి, రైజోబియం వాడాలన్నారు. సమగ్ర సస్యరక్షణకు పురుగు మందులు మాత్రమే కాకుండా, పసుపు, జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు, వేప ఆధారిత మందులు వాడాలని, సంవత్సరం ఒకే పంట వేయకుండా పప్పుధాన్యాలు, నూనె గింజలు మార్చి వేయాలని సూచించారు. రేపల్లె డివిజన్ ఇంచార్జీ సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారి వేమూరి రమేష్ బాబు మాట్లాడుతూ రైతులు కేవలం ఒకే వరి పంటపై ఆధారపడకుండా, పంటలతో పాటు అనుబంధ వ్యవసాయ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆవులు, గేదెలు పెంపకం ద్వారా పాలు, పెంట ఎరువు ద్వారా అదనపు ఆదాయం, కోళ్లు, మేకల పెంపకం ద్వారా తక్కువ పెట్టుబడితో నెలవారీ ఆదాయం పొందవచ్చు అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.