క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి జోన్ల వారీగా సమావేశాలు
క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి జోన్ల వారీగా సమావేశాలు
- అగ్నిమాపక సేవల ఆధునీకరణకు రూ.235 కోట్లు
- ఒంగోలులో జోన్–3 అగ్నిమాపక సేవల అసోసియేషన్ సమావేశo
సూర్య, ఒంగోలు :
అగ్నిమాపక సిబ్బంది క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు జోన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే.చంద్రశేఖర్ తెలిపారు. జోన్–3 జోనల్ సమావేశం బుధవారం ఒంగోలు ఫైర్‌స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది.
రాష్ట్ర అధ్యక్షులు కే.చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కే.శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన సంఘ నాయకులు, సిబ్బంది పాల్గొని క్షేత్రస్థాయి సమస్యలు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, సిబ్బంది సంక్షేమ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ మీడియా తో మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా ప్రభుత్వం రూ.235 కోట్లు కేటాయించడం, రెండు విడతల నిధులు ఇప్పటికే విడుదల చేయడం అభినందనీయమన్నారు. ఈ నిధులతో ఫైర్‌స్టేషన్లకు కొత్త ఫైర్ ఇంజన్లు, ఆధునిక రెస్క్యూ పరికరాలు సమకూర్చడంతో పాటు శిథిలావస్థలో ఉన్న స్టేషన్లను ఆధునీకరించాలని, అవసరమైన చోట కొత్త భవనాలు నిర్మించాలని కోరారు. సిబ్బందికి అధునాతన శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో అగ్నిమాపక సిబ్బంది కీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు. శాఖను ఆధునిక వనరులతో బలోపేతం చేయడంతో పాటు సిబ్బంది సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో సిబ్బంది ప్రస్తావించిన సమస్యలను డీజీ పి.వి.రమణ దృష్టికి, అవసరమైన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
ప్రభుత్వ సహకారం–అధికారుల కార్యాచరణ–సిబ్బంది సమన్వయంతో అగ్నిమాపక సేవలను మరింత బలోపేతం చేయాలన్నదే అసోసియేషన్ లక్ష్యమని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
సమావేశంలో రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ మస్తాన్, జాయింట్ సెక్రటరీలు గంగాధర్, రాజేంద్రప్రసాద్, చీఫ్ అడ్వైజర్ మునాఫ్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఏడుకొండలు, కార్యదర్శి బ్రహ్మయ్య
విష్ణువర్ధన్, జి రమేష్, బి లక్ష్మా నాయక్, పి కిరణ్ కుమార్ తో పాటు మూడు జిల్లాలకు చెందిన సంఘ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.