కూటమి ప్రభుత్వంలో ప్రగతి పథంలో పల్లెలు : టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్
అమరావతి, మేజర్‌న్యూస్ :
గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి పనిచేస్తున్న ఎన్డీఏ కూటమికి పంచాయతీ ఎన్నికల్లో మరోసారి ప్రజలు మద్దతుగా నిలవాలని టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 26, 29 తేదీలతో పాటు డిసెంబర్ 2న మూడు విడతలుగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 28 జిల్లా పరిషత్తులకు గాను 27, మొత్తం 659 ఎంపీపీలకు గాను 600కు పైగా స్థానాలను కూటమికి కట్టబెట్టి ప్రజలు తమ విశ్వాసాన్ని చాటుకున్నారని గుర్తుచేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగం అభివృద్ధి, మెరుగైన పౌర సేవలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అయితే, రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులకే ఎందుకు ఓటు వేయాలి? వైసీపీ బలపరిచిన అభ్యర్థులను ఎందుకు తిరస్కరించాలి? అనే విషయాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు మెరుగైన పాలన అందించాలంటే అభివృద్ధిని ఆకాంక్షించే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత పాలనలో గ్రామీణ ప్రాంతాలు ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని, గ్రామాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటర్లు తమ నిర్ణయం తీసుకోవాలని అప్పసాని రాజేష్ కోరారు. రాజకీయ కక్షలు, వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే అభ్యర్థులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డికి పల్లెల అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అప్పసాని రాజేష్ వివరించారు. ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, నేడు ఆ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టే నైతికత ఆయనకు లేదని రాజేష్ విమర్శించారు. గతంలో మైకు దొరికిన ప్రతిసారీ వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు 96 శాతం ప్రజాప్రతినిధులు మా పార్టీ నుంచే ఉన్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేవారు. మరి 96 శాతం మంది మీరే ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ ద్వారా అందించిన రూ. 9 వేల కోట్ల నిధులను ఎటు దారి మళ్లించారు? ఆ నిధులను విడుదల చేయాలని కోరుతూ మీ సొంత పార్టీకి చెందిన వేలాది మంది సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలే నాటి పంచాయతీరాజ్ ఛాంబర్‌ను, కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నాలు చేసిన విషయం వాస్తవం కాదా? నిధులు అడిగిన సొంత పార్టీ ప్రజాప్రతినిధులపైనే లాఠీఛార్జీలు చేయించిన చరిత్ర మీది. గ్రామాల్లో ఒక మంచినీటి కుళాయి రిపేర్ చేయించాలన్నా, వీధి లైటు మార్చాలన్నా, పారిశుధ్య పనులు చేయించాలన్నా డబ్బులు లేక ఓట్లేసిన ప్రజల ముందు మీ సర్పంచులనే డిఫాల్టర్లుగా, దోషులుగా నిలబెట్టారు. ఇవాళ వైసీపీ తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఒక్కసారి ఆనాడు గెలిచిన సర్పంచులను కలిసి వారి ఆవేదనను తెలుసుకోవాలి. 2024లో మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం నుంచి రావాల్సిన రూ. 4,200 కోట్ల ఫైనాన్స్ కమిషన్ నిధులను నేరుగా పంచాయతీలకు విడుదల చేశాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాము. 'పల్లె పండుగ 1.0, 2.0' కార్యక్రమాల ద్వారా ఇప్పటికే వేలాది కోట్ల రూపాయల పనులు పూర్తి చేయగా, ఇటీవలే 'పల్లె పండుగ 3.0' ద్వారా మరో రూ. 11 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాము. మొత్తంగా సుమారు రూ. 32 వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దుతున్నాము. ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 880 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు మాత్రమే వేశారు. కానీ, మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 12,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు, అలాగే 19,100 కిలోమీటర్ల బీటీ (బ్లాక్ టాప్) రోడ్ల నిర్మాణం పూర్తి చేశాము. 880 కిలోమీటర్ల సీసీ రోడ్లు ఎక్కడ? 12,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 19,100 కిలోమీటర్ల బీటీ రోడ్లు ఎక్కడ? ఈ అభివృద్ధి అంతా గ్రామీణ ప్రజల కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ప్రజలు వైసీపీ ప్రతిపాదించిన అభ్యర్థులను పూర్తిగా తిరస్కరించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగకపోయినా, స్థానిక కార్యకర్తలను పోటీ పేరుతో నిలబెట్టి వారిని బలిపశువులను చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. అధికారం దక్కిన ఐదేళ్లు గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసిన నాయకుడిని నమ్మి మోసపోవద్దని వైసీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలకు సూచిస్తున్నాము. గ్రామీణ ఓటర్లందరూ వాస్తవాలను గమనించి, గ్రామాల అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నామని అప్పసాని రాజేష్ పేర్కొన్నారు.
రైతులను నట్టేట ముంచి, ప్రజల ఆస్తులపై బొమ్మలేసుకున్న జగన్ రెడ్డిని గ్రామీణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, భూహక్కుల భద్రత, పారిశుధ్యం వంటి అంశాల్లో గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని అప్పసాని రాజేష్ వివరించారు. గ్రామీణ ప్రాంత ప్రజల జీవనం భూమితో పెనవేసుకుని ఉంటుందని, రైతులు, రైతు కూలీలు, కులవృత్తుల వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికలకు ముందు రూ. 3 వేల కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఐదేళ్ల పాలనలో కేవలం రూ. 800 కోట్లు (ఏడాదికి సగటున రూ. 160 కోట్లు) మాత్రమే ఖర్చు చేశారు. అదే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే ఉల్లి, పొగాకు, కోకో, మామిడి రైతులకు గిట్టుబాటు ధర రాని సమయంలో తక్షణమే స్పందించి రూ. 1,200 కోట్లు (ఏడాదికి సగటున రూ. 600 కోట్లు) ఖర్చు చేసి రైతులకు అండగా నిలిచింది. ఉల్లి రైతులకు హెక్టారుకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాము. పొగాకు రైతులకు రూ. 350 కోట్లతో ప్రభుత్వమే అదనపు ధర చెల్లించి కొనుగోలు చేసింది. మామిడికి కిలోకు రూ. 4 అదనపు ధర చెల్లించడంతో పాటు కోకోను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. అంతేకాకుండా, గత ప్రభుత్వం 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'కు రాష్ట్ర వాటా మార్జిన్ మనీ చెల్లించకుండా పంట బీమా వ్యవస్థనే నిర్వీర్యం చేసింది. ప్రతి ఇంటి నుంచి నెలకు రూ. 60 చొప్పున చెత్త పన్ను వసూలు చేసిన జగన్మోహన్ రెడ్డి, పన్ను వసూలు చేశారే తప్ప చెత్తను మాత్రం తొలగించలేదు. ఖజానాలో వేల కోట్ల లోటు బడ్జెట్, లక్షల కోట్ల అప్పులతో పాటు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మా ప్రభుత్వానికి వారసత్వంగా మిగిల్చారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలపై భారంగా మారిన చెత్త పన్నును రద్దు చేయడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన 85 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేసి పారిశుధ్యాన్ని మెరుగుపరిచాము. ఐదేళ్ల కాలానికి ఎన్నికైన ముఖ్యమంత్రి అయి ఉండి, శాశ్వతంగా ఉండే ప్రభుత్వ సర్వే రికార్డులు, రైతుల పట్టాదారు పాసు పుస్తకాలు, చివరికి ప్రజల వ్యక్తిగత ఆస్తుల సరిహద్దు రాళ్లపైనా తన బొమ్మలు వేయించుకోవడానికి రూ. 700 కోట్ల ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి వృథా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో 'డిస్ప్యూట్ రిజిస్టర్' పెట్టి ప్రజల ఆస్తులను హరించే కుట్రకు తెరలేపారు. మా ప్రభుత్వం రాగానే ఆ చట్టాన్ని రద్దు చేశాము. రైతుల మనసుల్లో భయాన్ని తొలగిస్తూ, ఇప్పటివరకు 33 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను ప్రభుత్వ రాజముద్రతో పంపిణీ చేశాము. త్వరలోనే మరో 60-65 లక్షల పాసు పుస్తకాలను అందించబోతున్నాము. సరిహద్దు రాళ్లపై ఉన్న బొమ్మలను కూడా తొలగించి ప్రజల ఆస్తులకు పూర్తి భద్రత కల్పించాము.
2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు, నాటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఏడాదికి సగటున రూ. 13,600 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. 68 వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులను పరుగులెత్తించాము. కానీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో కేవలం రూ. 22 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి సాగునీటి రంగాన్ని కుదేలు చేశారు. 2021 నవంబర్ 19న సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు కోల్పోయి, వందలాది ఎకరాలు ఇసుక మేటలతో నిండిపోతే, 13 రోజుల తర్వాత డిసెంబర్ 2న తీరిగ్గా పరామర్శకు వెళ్లిన చరిత్ర ఆయనది. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారి నేతృత్వంలో కేవలం రెండేళ్లలోనే రూ. 24 వేల కోట్లు ఖర్చు చేశాము. రాబోయే మూడేళ్లలో రూ. 39 వేల కోట్లతో 36 ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాము. ఇన్ని వాస్తవాలు కళ్ల ముందు కనిపిస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంత రైతులు, ప్రజలు వైసీపీ అభ్యర్థులను ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని అప్పసాని రాజేష్ విజ్ఞప్తి చేశారు.
గ్రామాల అభివృద్ధి కోసం వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుని ఏకగ్రీవాలకు సహకరించాలి
రాబోయే మూడు దశల గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలనే స్థిర నిర్ణయంతో గ్రామీణ ప్రజలు ఉన్నారని అప్పసాని రాజేష్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని, రాష్ట్రంలోని 13,000 పంచాయతీల్లోనూ కూటమి మద్దతుదారులే సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలవడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. వైసీపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న, ఇప్పటికే నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులు ఒక్కసారి ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఆయన ఒక 'తీసేసిన తహసీల్దార్, ఊడగొట్టిన నాగలి' వంటి స్థితిలో ఉన్నారు. ఆయన మాటలు విని పోటీలో నిలబడటం వల్ల మీ డబ్బులు వృథా కావడం తప్ప గ్రామాల్లో మీరు చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి విత్ డ్రా చేసుకుని తప్పుకుంటే పంచాయతీలు ఏకగ్రీవమవుతాయి. మా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఏకగ్రీవమైన మైనర్ పంచాయతీలకు రూ. 15 లక్షలు, మధ్యస్థ పంచాయతీలకు రూ. 25 లక్షలు, మేజర్ పంచాయతీలకు రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందుతాయి. మీ వృథా ప్రయాసను ఆపి, గ్రామాలకు ఆ నిధులు అందేలా మార్గం సుగమం చేయాలని సున్నితంగా సలహా ఇస్తున్నాము. 2024లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ ఛైర్మన్లుగా వైసీపీ హయాంలో గెలిచిన వారే పదవుల్లో ఉన్నారు. అయినప్పటికీ మేము ఎలాంటి రాజకీయ వివక్ష చూపకుండా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇస్తూ 'పల్లె పండుగ 1.0, 2.0' ద్వారా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు పరుగులెత్తించాము. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కాని వారిని ఎన్ని వేధింపులకు గురిచేశారో ప్రజలందరి కళ్ల ముందే ఉంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన డ్వాక్రా వ్యవస్థ ద్వారా నేడు 90 లక్షల మందికి పైగా మహిళలు ఆర్థిక సాధికారత సాధించి తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. గడిచిన 30 ఏళ్లలో గ్రామీణ మహిళల్లో వచ్చిన ఈ చైతన్యానికి చంద్రబాబు నాయుడు గారే ప్రధాన కారణం. మరోవైపు గ్రామాల్లో మెరుగుపడుతున్న మౌలిక సదుపాయాలు, 'మన మిత్ర' యాప్ ద్వారా ప్రజలకు సులభంగా అందుతున్న పౌర సేవలను చూసి మహిళలు, రైతులు, చేతివృత్తుల వారంతా కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి 26, 29 తేదీలు, డిసెంబర్ 2న జరిగే మూడు విడతల ఎన్నికల్లోనూ ఓటర్లు ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులను ఆశీర్వదించాలని అప్పసాని రాజేష్ విజ్ఞప్తి చేశారు.