కూటమి అభ్యర్థులను గెలిపించండి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులకు 100 శాతం విజయశాతంతో గెలుపు అందిస్తే 100 శాతం అభివృద్ధి సాధించే బాధ్యత తమదని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ పేర్కొన్నారు. మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలంతా గమనించారన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన, విధ్వంసం, తప్పుడు కేసులు తప్పా వైసీపీ ప్రభుత్వం ఇంకేం సాధించలేదన్నారు. అమరావతిపై రెండు మూడు మాటలు మాట్లాడి వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారన్నారు. అయితే తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుండి వెచ్చించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. వైసీపీ కారణంగా వెనుకబడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుందన్నారు. ఒక్క మండపేట లోనే గడిచిన రెండున్నరేళ్లలో 230 కోట్లు సంక్షేమానికి వెచ్చించడం జరిగిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభం అవుతున్నాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ కి అవకాశం ఇస్తే మరలా గొడవలు రాజ్యమేలతాయని విమర్శించారు. ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గారు, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ గారు, నియోజకవర్గ పరిశీలకురాలు తుమ్మల సునీత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, అమలాపురం పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, పట్టణ టీడీపీ అధ్యక్షులు మత్స నాగబాబు, మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, చాపల వీరబాబు, సవరపు సతీష్ తదితరులు పాల్గొన్నారు.