పామూరులో బంగారం చోరీ
- అమ్మవారి దర్శనానికి వెళ్లిన కుటుంబానికి ఇంటికొచ్చేసరికి షాక్
- ఇంటి తాళం తొలగించి బీరువా తెరిచి 49 గ్రాముల బంగారు ఆభరణాల అపహరణ
- ఘటనాస్థలంలో పోలీసులు వేలిముద్రల సేకరణ
- నిందితులను గుర్తించి న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు
పామూరు, మేజర్ న్యూస్ :
దసరా పండుగ సందర్భంగా కుటుంబంతో కలిసి అమ్మవారి దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబానికి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ఇంటి తాళం తొలగించి లోపలికి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు బీరువాను తెరిచి 49 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించుకెళ్లారు. ఈ ఘటన పామూరు పట్టణంలోని డీవీ పాలెంలో చోటుచేసుకుంది.
డీవీ పాలెంకు చెందిన నాగి పెద్ద శ్రీను కుమార్తె సౌజన్య దసరా పండుగ సందర్భంగా పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చింది. ఈ నెల 22న కుటుంబ సభ్యులతో కలిసి పల్నాడు ప్రాంతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనానికి వెళ్లారు. 23వ తేదీ రాత్రి తిరిగి ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు బయట గేటును తెరిచి లోపలికి వెళ్లి పరిశీలించగా ఇంటి తాళం తొలగించిన ఆనవాళ్లు కనిపించాయి. అనంతరం బీరువాను పరిశీలించగా అందులో భద్రపరిచిన రెండు బంగారు చైన్లు, ఒక లాకెట్, రెండు ఉంగరాలు, ఒక జత బుట్టకమ్మలు, ఒక జత రోజువారీ కమ్మలు, ఒక జత చెవి చాట్లు, పిల్లలు రోజువారీ ధరించే ఒక జత కమ్మలు, ఐదు కాసులు కలిపి మొత్తం 49 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళం తొలగించి లోపలికి ప్రవేశించి బీరువా తెరిచి ఆభరణాలను అపహరించినట్లు బాధితులు గుర్తించారు. వెంటనే పామూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమార్తె దసరా పండుగకు పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చిందని ఆభరణాలను బీరువాలో భద్రపరిచి కుటుంబ సభ్యులంతా అమ్మవారి దర్శనానికి వెళ్లామని తిరిగి వచ్చేసరికి చోరీ జరిగినట్లు పోలీసులకు వివరించారు. ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. ఇంట్లోని కుటుంబ సభ్యుల వేలిముద్రలను సైతం సేకరించి దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడిన దుండగులను త్వరితగతిన గుర్తించి అపహరణకు గురైన బంగారు ఆభరణాలను రికవరీ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు పోలీసు అధికారులను కోరుతున్నారు.