కొండిపర్రులో రూ.18.60 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన
పామర్రు, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. “పల్లె పండుగ 3.0” కార్యక్రమంలో భాగంగా పామర్రు మండలం కొండిపర్రు గ్రామంలో రూ.18.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి పల్లెను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకే పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామస్థులకు రవాణా ఇబ్బందులు లేకుండా నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్, పామర్రు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జన్ను శోభన్ బాబు, సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.