కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ మరియు రైల్వే కాలనీలలో సరఫరా చేస్తున్న నీటి నాణ్యతపై పటిష్ఠ పర్యవేక్షణ
కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ మరియు రైల్వే కాలనీలలో సరఫరా చేస్తున్న నీటి నాణ్యతపై పటిష్ఠ పర్యవేక్షణ
సెప్టెంబర్ 1 నుంచి 26 వరకు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ మరియు రైల్వే కాలనీలలో సేకరించిన మొత్తం 1,917 నీటి నమూనాలు తాగడానికి అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారణ
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికులకు మరియు రైల్వే సిబ్బంది, నివాసితులకు సురక్షితమైన, పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ చర్యల్లో భాగంగా హైదరాబాద్ డివిజన్ పరిధిలోని కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ మరియు అనుబంధ రైల్వే కాలనీలలో తనిఖీలు, నిర్వహణ చర్యలు మరియు నీటి నాణ్యత పర్యవేక్షణను మరింత విస్తరించింది.
ఈ సమగ్ర పరిశీలనలో భూగర్భ జల వనరులు, మున్సిపల్ నీటి సరఫరా, నీటి నిల్వ సదుపాయాలు, క్లోరినేషన్ ప్రక్రియలు మరియు నీటి పంపిణీ వ్యవస్థలను సమీక్షించారు. నీటి నాణ్యతపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు, ప్రతిరోజూ అవశేష క్లోరిన్ స్థాయిలను తనిఖీ చేయడంతో పాటు, నీటిలో E. coli బ్యాక్టీరియా కలుషితాన్ని గుర్తించేందుకు క్రమం తప్పకుండా బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సెప్టెంబర్ 1 నుంచి 26 వరకు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ మరియు రైల్వే కాలనీలలో సేకరించిన నీటి నమూనాలను పరిశీలించగా, అన్ని ప్రమాణాల ప్రకారం నీటి నాణ్యత సంతృప్తికరంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది.
పర్యవేక్షణలో ముఖ్యమైన అంశాలు:
• కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ మరియు రైల్వే కాలనీలలో తాగునీటికి సంబంధించి 1,917 నీటి నమూనాలను అవశేష క్లోరిన్ స్థాయిల కోసం పరీక్షించారు. అన్ని నమూనాలు సంతృప్తికరంగా ఉండగా, ఏ ఒక్క నమూనా కూడా తాగడానికి అనర్హంగా ఉన్నట్లు గుర్తించలేదు.
• 315 తాగునీటి నమూనాలను బ్యాక్టీరియాలజికల్ పరీక్షలకు పంపించారు. వీటిలో ఏ ఒక్క నమూనా కూడా అసురక్షితంగా ఉన్నట్లు గుర్తించలేదు. అలాగే, E. coli పాజిటివ్ నమూనా ఒక్కటి కూడా గుర్తించబడలేదు.
• 17 నీటి నమూనాలను రసాయన విశ్లేషణకు పంపించగా, అన్ని నమూనాలు తాగడానికి అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది.
• తాగునీటి వనరులు, గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్లు (GLRs), హై లెవల్ రిజర్వాయర్లు (HLRs) వద్ద ఇంజినీరింగ్ మరియు వైద్య విభాగాలు సంయుక్తంగా 94 తనిఖీలు నిర్వహించాయి.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, తాగునీరు ఎలాంటి కలుషితానికి గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైల్వే స్టేషన్లలో సరఫరా చేసే తాగునీటి నాణ్యత ఇండియన్ రైల్వేస్ మెడికల్ మాన్యువల్‌లో నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే, తరచుగా పరీక్షలు మరియు పర్యవేక్షణ చేపడుతూ ఇదే స్థాయి అప్రమత్తతను రైల్వే జోన్ అంతటా కొనసాగించాలని అధికారులు మరియు పర్యవేక్షకులకు ఆయన సూచించారు. ప్రయాణికులు మరియు రైల్వే నివాసితులందరికీ శుభ్రమైన, సురక్షితమైన మరియు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన ఆదేశించారు.