కనుమరుగవుతున్న కళారూపాలు - ఆదరణ తగ్గిన గంగిరెద్దులు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : సమాజంలో క్రమీణా ప్రాచీన కళారూపాలు కనుమరుగవుతున్నాయి. జానపద కళలు, ప్రాచీన సాంప్రదాయ కళలు, ఆటలు, క్రీడలు అంతరించిపోతుండగా రంగస్థలం నాటకాలకు ఆదరణ గణనీయంగా తగ్గింది.బుర్రకథలు, హరికథలు,ఒగ్గు కథలు, జానపద గేయాలాపనలు,జానపద నృత్యాలు కానరావడం లేదు.రంగస్థలం నాటకాలకు ఆదరణ బాగా తగ్గిపోయింది.ఎంతో కొంత భక్త చింతామణి రంగస్థలం నాటకానికి ఆదరణ ఉండగా గత ప్రభుత్వం చింతామణి నాటక ప్రదర్శన రద్దు చేసింది. దాంతో పలువురు కళాకారులు ఉపాధి కోల్పోయారు. తోలుబొమ్మలాటలు,వీధి నాటకాలు, చెక్కభజనలు, యక్షగానాలు అంతరించిపోయాయి. పండరి భజనలు, కోలాటాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. గతంలో లాగా కబడ్డీ, కోకో, చెడుగుడు, బొంగరాలు, చెమ్మచెక్క, కుందుడు గుమ్మ,పరుగు పందాలు, గోలీలాటలు, బిల్లం గోడు, పులిజూదం, కోతికొమ్మచ్చి, చదరంగం, తదితర ఆటలు కానరావడం లేదు. వేముల స్వామి గుర్రాలు కాన రావడం లేదు. సంక్రాంతి సందర్భంగా హరిదాసులు, గంగిరెద్దులు, పగటివేషకాలు కానరావడం లేదు. బుధవారం ఆత్మకూరులో ఒక గంగిరెద్దు తో ఒక ఎద్దును ఆడించే వ్యక్తి రాగా ఆయనను పలకరిస్తే తమకు ఆదరణ బాగా తగ్గిందని గతంలో తమ కుటుంబాలు గంగిరెద్దులాటల ద్వారా జీవనం సాగించే వారని నేడు నిరాశగా మారిందని, గంగిరెద్దుల కులస్తులమైన తాము ఇంకా కొందరం వృత్తిగా కొనసాగిస్తున్నామని, తమ బిడ్డలను చదువుకు మళ్లించామని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం కు చెందిన కొమ్మ వెంకటేశ్వర్లు గంగిరెద్దుల ఆడించుకుంటూ ఇంటింటికి వచ్చి ఎద్దును ఆడిస్తూ సంభావనలు అడుగుతుండగా జనాలు పెద్దగా స్పందించడంz తిలకించడం సంభావం లేవడం కానరాలేదు. గతంలో గంగిరెద్దులతో గ్రామాల్లో రెండు ఎద్దులు రాముడు సీత అంటూ వివాహం జరిపినట్లుగా ఆటలాడిస్తుంటే జనాలు గుమికూడి తిలకించేవారు. నేడు ఆ ఎద్దులతో ఇంటికి తిరిగినా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మార్కాపురంలో తమ కులస్తులు 300 కుటుంబాల వారం ఉన్నామని, తమ తరం వారు మాత్రం నెల్లూరు,ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తూ అరాకొరగా గంగిరెద్దులతో సంభావనలు స్వీకరించి వెళుతున్నామని ఆశించిన ఫలితం ఉండడం లేదని ఆయన వివరించారు. ప్రభుత్వపరంగా ఉత్సవాల్లో తమ గంగిరెద్దుల ప్రదర్శనలు ఏర్పాటుకు అవకాశం కల్పిస్తే తమకు తగిన విధంగా జీవన ఉపాధి లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఏడాదిలో 75శాతం రోజులు స్వగ్రామం వదిలి ఇతర ప్రాంతాల్లో గంగిరెద్దులతో ఆటలాడిస్తుండే వారమని, నేడు ఆ పరిస్థితి లేదని వృత్తిని వదులుకోలేక కొంతమేరకు కొనసాగిస్తున్నామని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.