కావలి మున్సిపల్ ఎన్నికల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బీ-ఫారాల అందజేసిన వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు కాకాని.
కావలి, మేజర్ న్యూస్ : కావలి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బుధవారం బీ-ఫారాలు అందజేశారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ముందుగా వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డికి, అనంతరం వివిధ వార్డుల నుండి పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులకు నేతలు బీ-ఫారాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంగళవారం కావలి పట్టణంలో జరిగిన ఘర్షణపై స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని వారు ఆరోపించారు. ప్రజా సేవను విస్మరించి అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని వారు విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపిస్తారని, అలాగే 2029 ఎన్నికల్లోనూ తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి, వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.