పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో తనిఖీలు
చీపురుపల్లి మేజర్ న్యూస్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక దళాలతో ముమ్మరంగా వాహన తనిఖీలు బుధవారం నిర్వహించామని ఎస్ఐ పి ఉమా వెంకటేశ్వర రావు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రత్యేక బలగాలతో కలిసి పట్టణంలోని మూడు రోడ్ల కూడలి వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అక్రమంగా నగదు, మద్యం, ఉచిత పంపిణీ వస్తువులు, ఇతర నిషేధిత సామాగ్రిని తరలించకుండా కట్టడి చేయడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రధాన రహదారులు కూడళ్ల వద్ద ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర రవాణా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని, ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఎక్కడైనా అక్రమ కార్యకలాపాలు జరిగినట్లు తెలిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా