గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ విజయం కూటమిదే - టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
అమరావతి, మేజర్‌న్యూస్ :
ఈవీఎంలతో ఎన్నికలు జరిగినా, బ్యాలెట్ పద్ధతిలో జరిగినా ప్రజల మద్దతు కూటమి వైపే ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కూటమి పార్టీల ఉమ్మడి మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర పీవీఎన్ మాధవ్‌లు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు కూటమికి పట్టం కట్టారు. ఈ విజయంతో ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకం మరోసారి నిరూపితమైంది. ఇదే విజయ స్ఫూర్తిని రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కూటమిని ఆశీర్వదించినట్లుగానే, గ్రామాల్లోనూ కూటమి బలపరిచే అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తోంది. స్థానిక సంస్థల్లోనూ కూటమికి ప్రజలు మద్దతు ఇస్తే, కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలు కలిసి పనిచేసే ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుంది. తద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థాయిలో మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరుతాయి. గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాజకీయంగా, సామాజికంగా వారికి మరింత ప్రాధాన్యం కల్పించాం. తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు, ఎల్‌నినో ప్రభావం, నీటి సంక్షోభం వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రభుత్వం సమర్థవంతంగా పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నికలను రిగ్గింగ్ ద్వారా గెలవాలనే ధోరణి కనిపించింది. పులివెందులలో కూడా దశాబ్దాలుగా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు లేవు. నేడు ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుని కూటమికి మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మూడు పార్టీల నాయకులు పరస్పర సమన్వయంతో ముందుకు వెళ్తారు. గ్రామస్థాయిలోనూ, మండల స్థాయిలోనూ చర్చలు జరిపి, ప్రజల్లో ఆదరణ ఉన్న, సమర్థత కలిగిన అభ్యర్థులను గుర్తించి వారికి అవకాశం కల్పిస్తాం. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు. కాబట్టి మూడు పార్టీల మధ్య అవగాహనతో రెబల్ అభ్యర్థులు లేకుండా, ఉమ్మడి అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించాం. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, మండల స్థాయిల్లో ఇప్పటికే సమన్వయ ప్రక్రియ కొనసాగుతోంది. అన్ని స్థాయిల్లో కలిసికట్టుగా పనిచేస్తూ 100 శాతం విజయ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. కూటమి ధర్మాన్ని ప్రతి నాయకుడు, కార్యకర్త పాటించాలి. వ్యక్తిగత అభిప్రాయాల కంటే కూటమి విజయం, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని అందరూ గుర్తించాలి.