మత్స్యకారులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఒంగోలు RDO చంద్రశేఖర నాయుడు.
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు గారి తక్షణ ఆదేశాలతో ప్రకాశం జిల్లా యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించింది. కొత్తపట్నం మండలం, కె. పల్లెపాలెం గ్రామంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో జీవనాధారం కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు, ఘటన జరిగిన కేవలం 12 గంటల వ్యవధిలోనే నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు ఆర్డీవో (RDO) శ్రీ చంద్రశేఖర్ నాయుడు గారు స్వయంగా పర్యవేక్షించి బాధితులకు ఈ సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఒంగోలు RDO చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ:
"జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు గారి ఆదేశాల మేరకు మేము తక్షణమే సహాయక చర్యలు చేపట్టాము. ఈరోజు తెల్లవారుజామున (ఎర్లీ మార్నింగ్) 12 గంటల ప్రాంతంలో కె. పల్లెపాలెం గ్రామంలోని మత్స్యకారులు వలలు భద్రపరుచుకునే ప్రాంతంలో దురదృష్టవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 300 మంది మత్స్యకార కుటుంబాలకు చెందిన విలువైన వలలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందిన వెంటనే గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు గారు మరియు స్థానిక శాసనసభ్యులు (ఎమ్మెల్యే) గారు సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు.కలెక్టర్ గారి స్పష్టమైన ఆదేశాలతో, ప్రమాదం జరిగిన కేవలం 12 గంటల్లోపే జీవనాధారం కోల్పోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సహాయంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో ఉల్లిపాయలు, 1 కిలో పంచదార, 1 కిలో బంగాళదుంపలు, కందిపప్పు ,1 కిలో,మరియు 1 లీటర్ వంట నూనె అందజేశాము. మత్స్యకార కుటుంబాలన్నీ ఈ సరుకులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.అంతేకాకుండా, కలెక్టర్ గారి సూచనల ప్రకారం ఈ ప్రమాదంలో మత్స్యకారులకు ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందో పూర్తి స్థాయిలో లెక్కలు (ఎన్యుమరేషన్) తీస్తున్నాము. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ శాశ్వత పరిహారం అందేలా ప్రభుత్వానికి త్వరలోనే సమగ్ర ప్రతిపాదనలు పంపిస్తాము."
బాధితుల హర్షం మరియు కృతజ్ఞతలు:
జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు గారి ఆదేశాలతో ప్రమాదం జరిగిన 12 గంటల్లోపే అధికారులు తమ వద్దకు వచ్చి నిత్యావసరాలు అందించడం పట్ల కె. పల్లెపాలెం మత్స్యకార కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. గతంలో ఎప్పుడూ ఇంత వేగంగా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోలేదని బాధితులు పేర్కొన్నారు. కష్టకాలంలో తమను ఆదుకున్న గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు గారికి, ఎమ్మెల్యే దామచర్ల .జనార్ధనరావు గారికి, ఒంగోలు RDO చంద్రశేఖర్ నాయుడు గారికి మరియు జిల్లా యంత్రాంగానికి బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కె. ఎం.రాజా, డిప్యూటీ తహసీల్దార్ సుష్మా తదితరులు పాల్గొన్నారు.