జనసేనలో చేరిన 15 కుటుంబాలు...
కావలి, మేజర్ న్యూస్ : కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెంలో వైఎస్‌ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. స్థానిక వార్డు మెంబర్లు, వైఎస్‌ఆర్‌సీపీ ముఖ్య నాయకులతో పాటు సుమారు 15 కుటుంబాలు ఆ పార్టీని వీడి జనసేన పార్టీ నాయకుడు చేవూరి కిరణ్ ఆధ్వర్యంలో బుధవారం జనసేనలో చేరాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్తలు మన్నెమాల సుకుమార్ రెడ్డి, సమ్మన వెంకటసుబ్బయ్య ముఖ్య అతిథులుగా హాజరై, నూతనంగా చేరిన వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమన్వయకర్తలు మాట్లాడుతూ.. జనసేన అధినేత ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై గ్రామీణ ప్రాంతాల్లో విశేష సంఖ్యలో నాయకులు, ప్రజలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కావలి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా చేరిన నాయకులు మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి, అంకబాబు, జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.