ఉగాండాలో డిజిటల్ క్రాక్‌డౌన్: పోస్టులు తొలగించబోమన్న నెటిజన్లు
సూర్య ఇంటర్నేషనల్ డెస్క్: ఆఫ్రికా దేశమైన ఉగాండాలో ఆన్‌లైన్ విమర్శకులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ప్రభుత్వం చేపడుతున్న కఠిన అణచివేత చర్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధ్యక్షుడు యోవేరి ముసెవెని ప్రభుత్వం, అధికార వర్గాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్న వారిపై అధికారులు తీవ్ర నిఘా ఉంచి, ‘కంప్యూటర్ మిస్‌యూజ్ యాక్ట్’ కింద వరుస అరెస్టులు చేస్తున్నారు. పోస్టులను తక్షణమే తొలగించాలని, క్షమాపణలు చెప్పాలని భద్రతా దళాలు హెచ్చరిస్తున్నప్పటికీ, పలువురు కార్యకర్తలు, నెటిజన్లు "మేము మా పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోము" అంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
టిక్‌టాక్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్ వేదికలుగా దేశంలోని అవినీతి, పాలనా వైఫల్యాలు మరియు ఎన్నికల ప్రక్రియను ప్రశ్నించిన పలువురు యువ కంటెంట్ క్రియేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ఏళ్ల తరబడి జైలు శిక్షలు విధిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశాధ్యక్షుడిని కించపరిచారని, సమాజంలో ద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే అభియోగాలు మోపుతూ ఇంటర్నెట్ వినియోగదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. అయినప్పటికీ పలువురు డిజిటల్ నిరసనకారులు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు.
అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ఉగాండా ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండించారు. డిజిటల్ మాధ్యమాలలో విమర్శలను నేరంగా పరిగణించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని, వెంటనే అరెస్టు చేసిన ఆన్‌లైన్ కార్యకర్తలను విడుదల చేసి భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు.