జలదంకిలో జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు
జలదంకి, మేజర్ న్యూస్ :
జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు జలదంకి మండలంలోని ఉన్నత, ప్రాథమికోన్నత, ఆదర్శ ప్రాథమిక, ప్రాథమిక పాఠశాలలను జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసింది.జిల్లా సమగ్ర శిక్ష - జిసిడిఓ (గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్) వై. శాంతకుమారి ఆధ్వర్యంలో డైట్ అధ్యాపకులు టి. ఉమామహేశ్వరి, పి. రజిని లు ఈ తనిఖీలు నిర్వహించారు.
విద్యా ప్రమాణాలు పెంపొందించడం, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడం, మిషన్ మార్చి - 2027 దృష్టిలో ఉంచుకుని 10వ తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్న ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టారు.
తనిఖీ చేసిన పాఠశాలలు :
• జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - బ్రాహ్మణ క్రాక • ఆదర్శ ప్రాథమిక పాఠశాల - బ్రాహ్మణ క్రాక (ఎస్.సి) • మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల - బి.కె. అగ్రహారం • ప్రాథమిక పాఠశాల - జమ్మలపాలెం కాలనీ
ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయులు - విద్యార్థుల హాజరు, పదో తరగతి విద్యార్థుల రోజువారీ టెస్టులు, 1 నుండి 9 తరగతుల ఎస్.ఏ - 1 పరీక్షల నిర్వహణ, వాటి మూల్యాంకనం మరియు మార్కులు ఆన్ లైన్ లో నమోదు, పాఠశాల రికార్డులు, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.మధ్యాహ్న భోజన సమయంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.పదో తరగతి విద్యార్థులు ప్రణాళికతో చదవాలి - శాంతకుమారి
అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బ్రాహ్మణ క్రాకలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన శాంతకుమారి.. నేటి నుండైనా ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి మార్కులతో నూరు శాతం ఫలితాలు సాధించవచ్చని, దానివల్ల పాఠశాలకు, మండలానికి, జిల్లాకు మంచి పేరు వస్తుందని సూచించారు.
మిషన్ మార్చి - 2027 గురించి మాట్లాడుతూ ఫేస్ - 2 షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారం నుండి అమలు జరుగుతుందని తెలియజేశారు. సబ్జెక్ట్ టీచర్లు రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ ను గుర్తించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి విద్యార్థి వారి తరగతుల వారీగా తెలుగు, ఆంగ్లం, గణితంలో కనీస సామర్థ్యాలను సాధించే విధంగా టీచర్లు కృషి చేయాలని, సులభంగా కనీస సామర్థ్యాలు సాధించే బోధనా పద్ధతులతో ముందుకు వెళ్లాలని సూచించారు.
పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించాలని, విలువలతో కూడిన విద్యా ప్రమాణాలు పెరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
తనిఖీల్లో మండల విద్యాశాఖ అధికారులు ఎన్. పద్మనాభం, సి.హెచ్. నాగేశ్వరరావు, డైట్ పల్లిపాడు లెక్చరర్లు టి. ఉమామహేశ్వరి, పి. రజిని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - బ్రాహ్మణ క్రాక ప్రధానోపాధ్యాయురాలు కె. జయలలిత, సిఆర్ఎంటిలు పి. రవిచంద్ర, డి. కొండయ్య మరియు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.