జగన్‌తో భేటీపై షర్మిల స్పష్టత: “అవన్నీ కట్టుకథలే.. పెళ్లి శుభకార్యాన్ని రాజకీయాలకు ముడిపెట్టొద్దు”
విజయవాడ:తనపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను ఎవరినో కలిశానని, మరొక పార్టీలోకి చేరిపోతున్నానని వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. తన రాజకీయ విశ్వసనీయతను దెబ్బతీసేందుకే కొందరు కావాలని ఇటువంటి కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు.
చివరిసారిగా రాజారెడ్డి పెళ్లి పిలుపు కోసమే కలిశా
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాను చివరిసారిగా తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చే సమయంలోనే కలిశానని షర్మిల గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ కలవాల్సి వస్తే.. అది కేవలం తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ పత్రిక అందించేందుకే తప్ప వేరే కారణం లేదని స్పష్టం చేశారు.
అన్ని పార్టీల నేతలకూ ఆహ్వానం సహజమే
శుభకార్యాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించి ఆశీస్సులు కోరడం సాధారణమైన విషయమని, ఇందులో ఎలాంటి రాజకీయ వింతలు లేవని చెప్పారు. కుటుంబ శుభకార్యాన్ని అడ్డుపెట్టుకుని తెరవెనుక రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు.
"నా కుమార్తె వివాహాన్ని రాజకీయాలతో ముడిపెట్టి నా విశ్వసనీయతను, ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదు" అని షర్మిల హెచ్చరించారు.
నవంబర్ 25న వివాహం
వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం ఈ నెల 24న, వివాహం నవంబర్ 25న జరగనున్నట్లు షర్మిల తెలిపారు. ఈ మహోత్సవానికి తెలుగు ప్రజలందరూ హాజరై నూతన దంపతులను హృదయపూర్వకంగా ఆశీర్వదించాలని కోరారు.