కుప్పంలో కృష్ణమ్మ పరవళ్లు.. కృష్ణా జలాలకు ఘనంగా జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు!
సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతూ కృష్ణా జలాలు పరవళ్ళు తొక్కుతూ ప్రవేశించాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా కుప్పం ప్రాంతంలో కృష్ణమ్మకు ఘనంగా జలహారతి ఇచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నీటి విడుదల కార్యక్రమం ద్వారా కుప్పం ప్రాంతంలోని సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణా నీళ్లకు పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రంలోని ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్‌కు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్ల కల సాకారమైన ఈ వేడుకలో పాల్గొనేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, టీడీపీ శ్రేణులు తరలివచ్చి సంబరాలు జరుపుకున్నారు. కృష్ణమ్మ పరవళ్లతో కుప్పం ప్రాంతం సస్యశ్యామలం కానుండటంతో రైతన్నల మొహంలో ఆనందం వెల్లివిరుస్తోంది.