ప్రభుత్వ నిర్లక్ష్యం.. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం
రిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన తెలంగాణ రక్షణ సేన నాయకులు
మెయింటెనెన్స్‌పై నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఆదిలాబాద్, సూర్య ప్రతినిధి:
ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘటనపై తెలంగాణ రక్షణ సేన నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం రిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన వారు ఘటనకు సంబంధించిన పరిస్థితులను పరిశీలించారు. పసిపిల్లల ఐసీయూలో 27 మంది చిన్నారులు చికిత్స పొందుతున్న సమయంలో ఏసీ పేలడంతో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి, పొగ కారణంగా పిల్లలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తిన ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యుత్ వ్యవస్థ, ఏసీలు, ఇతర పరికరాల నిర్వహణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యం జరిగిందని తెలంగాణ రక్షణ సేన నాయకులు ఆరోపించారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశాల్లో నిర్లక్ష్యాన్ని సహించరాదని, ఘటనకు దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ, ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల వైద్య ఖర్చులను ప్రభుత్వం పూర్తిగా భరించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రిమ్స్ డైరెక్టర్ వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు కోరారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, విద్యుత్ భద్రత, అత్యవసర పరికరాల నిర్వహణను పటిష్టంగా చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ బాపురావు గారు (మాజీ ఎమ్మెల్యే)
ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వేణుగోపాల్ యాదవ్,TRS ఎంపీ ఇంచార్జి మాడవి బాపూరావు, యుజన అధ్యక్షులు అసపు ప్రమోద్, TRS నాయకులు కార్తీక్, మనోజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.