ఇసుకపల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు మాలధారణ స్వాములకు అన్నదాన కార్యక్రమం.. భక్తిభావంతో సేవలందించిన మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ కోఆర్డినేటర్ అనగాని శివప్రసాద్
రేపల్లె మేజర్ న్యూస్; ఇసుకపల్లి గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, తెలుగుదేశం పార్టీ రేపల్లె నియోజకవర్గ కోఆర్డినేటర్ అనగాని శివప్రసాద్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములకు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ కోఆర్డినేటర్ అనగాని శివప్రసాద్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు.అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు భక్తితో భోజనాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆధ్యాత్మిక సేవాభావాన్ని చాటుకున్నారు. అయ్యప్ప మాలధారణ సమయంలో నియమనిష్ఠలతో దీక్ష కొనసాగించే స్వాములకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యప్రదమైన కార్యక్రమమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ భక్తుల సేవలో భాగస్వాములు కావడం అభినందనీయమని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొనగా, అయ్యప్ప స్వాములు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.