ఇళ్ల పట్టాలపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు..
విజయవాడ తూర్పు, మేజర్ న్యూస్: కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇళ్ల పట్టాల పంపిణీపై వైకాపా నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ కోరారు. బుధవారం విజయవాడలోని 5, 6 డివిజన్ల బూత్ కన్వీనర్లు, పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆమె ప్రజా సమస్యలు, పార్టీ పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విజయవాడ నగరంలో సుమారు 25 వేల మందికి పూర్తి హక్కులతో కూడిన ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియ చేపట్టిందని, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 8,150 మందికి పట్టాలు మంజూరయ్యాయని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో కొంతమంది లబ్ధిదారులకు నేరుగా పట్టాలు అందించలేకపోయామని, ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం అధికారులు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పట్టాలు అందజేస్తారని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా కొండ ప్రాంతాల ప్రజలు ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాల సమస్యకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, కొండ ప్రాంతాల్లో మెట్ల నిర్మాణం, రైలింగ్ ఏర్పాటు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నగర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు గద్దె అనురాధ తెలిపారు. ఈ సమావేశంలో 5, 6 డివిజన్ల కూటమి అభ్యర్థులు దాసరి మల్లేశ్వరి, దుంగా సంగీత లక్ష్మీలతో పాటు బూత్ కన్వీనర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.