హీరో షోరూం లో దొంగల బీభత్సవం..
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం పట్టణంలోని నరసింహ హీరో ద్విచక్ర వాహన షోరూంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. షోరూంలోకి చొరబడిన దుండగులు నగదుతో పాటు ద్విచక్ర వాహన విడిభాగాలను అపహరించడంతో నిర్వాహకులకు సుమారు రూ.1.50 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. షోరూం వెనుక భాగంలో ఉన్న కిటికీ గ్రిల్స్‌ను వంచి లోపలికి ప్రవేశించిన దుండగులు, అనంతరం కౌంటర్ డ్రాయర్లు, క్యాబినెట్‌ల తాళాలను పగలగొట్టి అందులోని వస్తువులను చిందరవందర చేశారు. షోరూం ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, కౌంటర్‌లో భద్రపరిచిన సుమారు రూ.98 వేల నగదును దుండగులు అపహరించారు. అదేవిధంగా షోరూంలో నిల్వ ఉంచిన దాదాపు రూ.60 వేల నుంచి రూ.70 వేల విలువైన ద్విచక్ర వాహన విడిభాగాలు సైతం మాయమైనట్లు గుర్తించారు. చోరీ అనంతరం షోరూంలోని వస్తువులు చిందరవందరగా ఉండటంతో సిబ్బంది ఈ ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షోరూంలోని పరిస్థితులను పరిశీలించడంతో పాటు చోరీ జరిగిన ప్రాంతానికి సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించి పరిశీలిస్తున్నారు. ఫుటేజీల ఆధారంగా దుండగులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పట్టణంలో వ్యాపార సంస్థలు, దుకాణాల వద్ద భద్రతపై ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. రాత్రి వేళల్లో వ్యాపార సంస్థల యజమానులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు. పట్టణంలో జరిగిన ఈ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.