గాంధీ బాటలోనే స్వచ్ఛ గ్రామ స్వరాజ్యం..
గాంధీ బాటలోనే స్వచ్ఛ గ్రామ స్వరాజ్యం..
*ప్రతి ఒక్కరూ పరిశుభ్రతలో భాగస్వాములు కావాలి
*రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, అక్టోబర్ 02, మేజర్ న్యూస్ ప్రతినిధి (ప్రేమ్ రాజ్✍️) : మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనతో పాటు పరిశుభ్రమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. సత్యం, అహింస, సేవాభావం, పరిశుభ్రత వంటి గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని అన్నారు. మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా శుక్రవారం మచిలీపట్నం చిలకలపూడి పోలీస్‌స్టేషన్ సెంటర్‌లోని గాంధీజీ విగ్రహానికి మంత్రి కొల్లు రవీంద్ర పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం, ప్రజల స్వేచ్ఛ కోసం మహాత్మా గాంధీ సుదీర్ఘ పోరాటం చేశారని మంత్రి అన్నారు. అహింస, సత్యాన్ని ఆయుధాలుగా చేసుకుని ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేసి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. గాంధీజీ త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని, ప్రతి మూడో శనివారం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు. రెండేళ్ల క్రితం గాంధీ జయంతి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో పర్యటించి పట్టణంలోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమానికి అప్పుడే శ్రీకారం చుట్టారని, ప్రస్తుతం ఆ కార్యక్రమం తుది దశకు చేరుకుందని తెలిపారు. గాంధీజీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడుస్తూ పరిశుభ్రత, సేవాభావం, సత్యం, అహింస వంటి విలువలను పాటించాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ ఫణి కుమార్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.