BREAKING
నేటి పంచాంగం23 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు23 నవంబర్, 2026 కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్లకు ఘన సత్కారం వైభవంగా శ్రీపంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సర్పంచ్లకు 13, వార్డులకు 133 నామినేషన్లు జడ్పీటీసీ ఉదయ్ కుమార్ పూజలు చిన్నారి రుతిక వైద్యానికి రూ.2,20,503 విరాళం జగ్గయ్యపేటలో విజయవంతంగా సేవలందిస్తున్న బొజ్జా డెంటల్ సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు

ఎస్‌ఐఆర్‌లో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకూడదు

Select Suryaa Now
ఎస్‌ఐఆర్‌లో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకూడదు

మచిలీపట్నం, మేజర్ న్యూస్: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ స్పష్టం చేశారు. ఓటర్ల పునఃపరిశీలనలో అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శనివారం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎస్‌ఐఆర్ పురోగతి, ఓటర్ల వివరాల పునఃపరిశీలన, కృష్ణ–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ డినోవో ఓటరు జాబితా తయారీపై కలెక్టర్ సమీక్షించారు.

జిల్లాలో ఇప్పటివరకు 24,603 మందిని శాశ్వతంగా వలస వెళ్లినవారిగా, 21,970 మందిని గైర్హాజరైనవారిగా గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు. వీరందరి వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చి, నిర్దిష్ట ప్రొఫార్మా, మార్గదర్శకాలు అందించినట్లు వివరించారు. తన పర్యవేక్షణలో వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇంకా వంద శాతం పూర్తయిందని చెప్పే పరిస్థితి లేదన్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 15 వరకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణకు గడువు ఉన్నందున గుర్తించిన ఏఎస్‌డీడీ (గైర్హాజరు, వలస, డూప్లికేట్, మరణించిన) ఓటర్ల వివరాలను ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు అందించినట్లు తెలిపారు. అవసరమైతే మరోసారి జాబితాలను అందిస్తామని, రాజకీయ పార్టీలు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ఓటర్లకు తిరిగి ఓటు హక్కు కల్పించేలా సహకరించాలని కోరారు.

ఏఎస్‌డీడీ జాబితాలోని ప్రతి ఓటరుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మరోసారి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, తిరిగి సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల వివరాలను మరోసారి ధ్రువీకరించి, అర్హులైన వారు ఓటు హక్కు కోల్పోకుండా చూస్తామన్నారు. విద్య, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన కుటుంబ సభ్యుల విషయంలోనూ వాస్తవ నివాస పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లి గ్రీన్ కార్డు పొందలేకపోవడం లేదా ఉద్యోగాలు కోల్పోవడం వంటి కారణాలతో తిరిగి స్వదేశానికి వచ్చిన వారు అర్హత కలిగి ఉంటే సంబంధిత దరఖాస్తు ఫారాల ద్వారా మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యమని, ఎవరినీ అనవసరంగా ఓటరు జాబితా నుంచి తొలగించకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తామని తెలిపారు.

ఓటరు గుర్తింపునకు ఆధార్ అనుసంధానం, ఐరిస్ గుర్తింపు విధానం ఉపయోగకరంగా ఉంటాయనే అభిప్రాయాలు సమావేశంలో వ్యక్తమయ్యాయి. అయితే ఆధార్‌లో వివరాల నవీకరణ పూర్తిస్థాయిలో జరగకపోవడం, ఆధార్‌ను ఎన్నికల గుర్తింపుగా పరిగణించడంలో ఉన్న చట్టపరమైన పరిమితులపై మరో ప్రతినిధి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశాలపై చట్టపరమైన నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటూ ఓటరు జాబితా రూపొందిస్తామని కలెక్టర్ తెలిపారు. 

కృష్ణ–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి డినోవో ఓటరు జాబితా తయారీపై కూడా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికకు ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటరు జాబితాను గత జాబితాతో సంబంధం లేకుండా కొత్తగా రూపొందించడం ఆనవాయితీ అని వివరించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం 2026 డిసెంబర్ 23 నుంచి 2027 జనవరి 12 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో 8వ తరగతి నుంచి బోధిస్తూ, నిబంధనల ప్రకారం కనీసం మూడు సంవత్సరాల నిరంతర బోధనా అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఓటరు నమోదుకు అర్హులని తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు తమ సాధారణ నివాస ప్రాంతానికి సంబంధించిన నియోజకవర్గంలోనే ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులెవరూ ఓటరు నమోదును కోల్పోకుండా రాజకీయ పార్టీలు, విద్యాసంస్థల యాజమాన్యాలు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మొత్తం 2,751 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ వెల్లడించారు. వీటిలో 2,324 ఆన్‌లైన్ ద్వారా, 427 ఆఫ్‌లైన్ ద్వారా అందాయని తెలిపారు. ఇప్పటివరకు 1,065 దరఖాస్తులను ఆమోదించగా, 71 దరఖాస్తులను తిరస్కరించినట్లు, మిగిలిన 1,615 దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని వివరించారు. అర్హులైన ప్రతి ఉపాధ్యాయుడికి ఓటు హక్కు కల్పించేందుకు సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీపీఎం తరఫున కొడాలి శర్మ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున కె. చంద్రశేఖర్, బీఎస్పీ తరఫున ఎస్. బాలాజీ, వైసీపీ తరఫున పేర్ని నాని, బీజేపీ తరఫున కె. శ్రీనివాసరావు, జనసేన తరఫున గడ్డం రాజు, తెలుగుదేశం పార్టీ తరఫున కె. మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.