ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్) డైరెక్టర్‌గా ప్రొఫెసర్, డాక్టర్ కె.వి. కృష్ణారావు గురువారం భాద్యతలు స్వీకరించారు. ఈయన ఐదేళ్ల వరకు పదవిలో కొనసాగనున్నారు. ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు ఇప్పటి వరకు ఐఐటి బాంబేలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందించారు. ప్రొఫెసర్ కృష్ణారావుకు రవాణా వ్యవస్థల ఇంజినీరింగ్, పట్టణ రవాణా ప్రణాళిక రంగాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా బోధన, పరిశోధన రంగాల్లో విశేష అనుభవం ఉంది. ఈయన కాకినాడలోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం (జేఎన్‌టీయూ) నుంచి 1984లో సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. 1986లో మద్రాస్‌లోని భారతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఐఐటి) నుంచి రవాణా ఇంజినీరింగ్‌లో మాస్టర్స్, పట్టణ రవాణా ప్రణాళికలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1996లో ఐఐటీ బాంబేలో ఉద్యగంలో చేరిన కృష్ణారావు సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు. వివిధ కీలక పరిపాలనా బాధ్యతలు నిర్వహించిన ఈయన స్థిరమైన పట్టణాభివృద్ధి, రవాణా ప్రణాళిక, ప్రయాణ ప్రవర్తన నమూనాలు, ట్రాఫిక్ రూపకల్పన, విశ్లేషణ, రహదారి నిర్వహణ తదితర అంశాలపై పరిశోధనలు సాగించారు. ప్రొఫెసర్ కృష్ణారావు పరిశోధన, బోధన రంగాల్లో చేసిన విశేష కృషికిగాను ఐఐటీ బాంబే ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అవార్డులను 2008, 2012, 2016లో అందుకున్నారు. ఇప్పటి వరకు 20 మంది డాక్టరేట్ పరిశోధకులకు మార్గదర్శకత్వం వహించారు. 100 మందికి పైగా సాంకేతిక విద్యార్థుల పరిశోధనలకు దిశా నిర్దేశం చేశారు. ఈయనకు అంతర్జాతీయ స్థాయి పరిశోధనా పత్రికలు, సదస్సుల్లో అనేక పరిశోధనా ప్రచురణలు ఉన్నాయి. భారతదేశానికి అనువైన రహదారి సామర్ధ్య ప్రమాణాల రూపకల్పనలో ప్రొఫెసర్ కృష్ణారావు కీలకంగా పనిచేశారు. ముంబై, నవీ ముంబై, పూణే మెట్రో రైలు వ్యవస్థల మాస్టర్ ప్లాన్ల తయారీలోనూ, ముంబై మహానగర ప్రాంతంలో ప్రతిపాదిత ప్రయాణికుల జల రవాణా వ్యవస్థల ప్రణాళికలోను విశేష సేవలందించారు. ప్రొఫెసర్ కృష్ణారావు ఐఐటి బాంబేలో సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా, పట్టణ శాస్త్రం, ఇంజనీరింగ్ కేంద్రం అధిపతిగా, అసోసియేటెడ్ డీన్, డీన్, డిప్యూటీ డైరెక్టర్ తదితర ఉన్నత పరిపాలన బాధ్యతలు సైతం సమర్థవంతంగా నిర్వర్తించారు. రవాణా ఇంజినీరింగ్, మౌలిక వసతుల ప్రణాళిక రంగాల్లో విస్తృతమైన విద్యా, పరిశోధనా, పరిపాలనా అనుభవం ఉంది. ఏపీ నిట్ డైరెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ కృష్ణారావుకు రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు డాక్టర్ జి.రవి కిరణ్ శాస్త్రి, డాక్టర్ వి.సందీప్, డాక్టర్ ఎన్.జయరామ్, డాక్టర్ జీబి వీరేష్ కుమార్, డాక్టర్ హిమబిందు, పలువురు ఆచార్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.
రిపోర్టర్ :శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా,