ఎన్నికలు ప్రశాంతంగా,పారదర్శకంగా నిర్వహించాలి
పలాస, సూర్య : మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది పూర్తి అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు మల్లవరపు సూర్య తేజ సూచించారు. ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల పరిశీలకులు స్వయంగా పంపిణీ ప్రక్రియను పరిశీలించి, చెక్‌లిస్ట్ ప్రకారం పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రి పూర్తిస్థాయిలో అందిందా లేదా అని తనిఖీ చేశారు. ఎన్నికల విధుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీన మాక్‌పోల్ నిర్వహించిన అనంతరం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారికి మాత్రమే మొబైల్ ఫోన్ వినియోగానికి అనుమతి ఉంటుందని, ఇతర సిబ్బంది, వ్యక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్ల వద్ద మొబైల్ ఫోన్లు, ఇంకు, వాటర్ బాటిళ్లు తదితర నిషేధిత వస్తువులు లేకుండా పోలీసు సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఓట్లు అభ్యర్థించడం వంటి చర్యలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.ప్రతి ఓటరు తన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా పింక్, వైట్ బ్యాలెట్ పేపర్ల వినియోగంపై స్పష్టమైన అవగాహన కల్పించాలని తెలిపారు. చెల్లని ఓట్లు (ఇన్‌వాలిడ్ ఓట్లు) పడకుండా ఓటింగ్ విధానంపై ఓటర్లకు అవసరమైన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తతతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. సూక్ష్మ పరిశీలకులు, రూట్ అధికారులు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలాస ఆర్డీఓ ఆర్. అప్పలస్వామి,మున్సిపల్ కమిషనర్ ఇ. శ్రీనివాసులు,ఎంపీడీఓ ఎన్.రమేష్ నాయుడు,డీఎస్పీ జి.వి. రమణ,ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.