ఎన్నికల్లో గెలిచినా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
ఎన్టీఆర్ జిల్లా, మేజర్ న్యూస్: ఎం.పి.టి.సి., జెడ్.పి.టి.సి. ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆంక్షలు విధించింది. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు కానీ, వారి మద్దతుదారులు కానీ ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు స్పష్టం చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో డప్పు వాయిద్యాలతో ప్రదర్శనలు, బాణసంచా కాల్చడం, అధిక శబ్దంతో మైక్ సెట్లు, డీజేలు వినియోగించడం పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్, పోలీస్ చట్టం అమలులో ఉన్నాయని పేర్కొన్నారు.
నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ర్యాలీలు నిర్వహించినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, ఇతర వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించినా సంబంధిత వ్యక్తులపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని, శాంతి సామరస్యాలను పాటించాలని పోలీస్ కమిషనర్ కోరారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.