బోటు మునిగి తమిళ జాలర్లు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం
అమరావతి, మేజర్‌న్యూస్ :
తమిళనాడు మత్స్యకారుల బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సముద్రంలో మత్స్యకారుల బోటు ప్రమాదంలో చిక్కుకుని పలువురు మృత్యువాతపడడం దురదృష్టకమని సీఎం అన్నారు. మురసు తుపాను ప్రభావంతో సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం ఆవేదన కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడు బోటు ప్రమాదం... గల్లంతైన వారి కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. పలువురు మత్స్యకారులు మరణించిన స్థితిలో ఉండగా ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరానికి బోటు కొట్టుకు వచ్చిందని అధికారులు చెప్పారు. ఈ బోటులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందిలో ఏడుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతు అయ్యారని తెలిపారు. మత్స్యకారుల మృతదేహాలను గుర్తించి సహయక చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు. ఇందుకోసం కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారుల బృందాలు సహా సంబంధిత అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. మృతదేహాలను గుర్తించడం, పోస్టుమార్టం తదితర అవసరమైన ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి వారి కుటుంబాలకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మత్స్యకారులు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు కావడంతో అక్కడి అధికారులతో సమన్వయం చేసుకుంటూ మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.