ఎన్నికల సామగ్రి కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం అనపర్తి మండల పరిధిలోని జడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా రమేష్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.శనివారం అనపర్తిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని, పరిసర ప్రాంతాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా రమేష్, మండల అభివృద్ధి అధికారి ఎం. రామకృష్ణారెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో శ్రీకాంత్ రెడ్డి, ఎస్సై వినయ్ ప్రతాప్ పరిశీలించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఇతర మౌలిక సదుపాయాలు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీడీవో ఎం. రామకృష్ణారెడ్డి వెల్లడించారు.ఈ నెల 24వ తేదీన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ), 25వ తేదీన నామినేషన్లపై అభ్యంతరాల పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు. 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని, అదే రోజు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. నవంబర్ 3వ తేదీన ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రిటర్నింగ్ అధికారి రాజా రమేష్ తెలిపారు. నవంబర్ 4వ తేదీన అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహించి, నవంబర్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని సూచించారు.