శ్రమ క్షేత్రంలో బతుకమ్మ సంబరం-గంగారం ఉపాధి పనుల్లో పండుగ వాతావరణం
కాటారం, మేజర్ సూర్య:అది నిత్యం కూలీల శ్రమతో, గునపాల చప్పుళ్లతో రద్దీగా ఉండే ఉపాధి హామీ పని ప్రదేశం. కానీ శనివారం అక్కడ పండుగ వాతావరణం సంతరించుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలోని గంగారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలు తమ పని స్థలంలోనే బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పండుగ వేళ కూలీలంతా ఒక్కతాటిపైకి వచ్చి వేడుకలు జరుపుకోవడంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది.కూలీలు తాము పనిచేసే చోటే శ్రమను మరిచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకున్నారు. భూమిని లోతుగా తవ్వి, మట్టితోనే ఎంతో అద్భుతంగా బతుకమ్మ ఆకారాన్ని తీర్చిదిద్ది తమ సృజనాత్మకతను చాటారు. అనంతరం ఆ మట్టి బతుకమ్మ చుట్టూ కూలీలంతా చేరి, చప్పట్లు కొడుతూ సాంప్రదాయ పాటలతో ఉత్సాహంగా నృత్యం చేశారు. నిత్యం పనులతో అలసిపోయే శ్రమజీవులు.. పండుగ వేళ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఐక్యతను చాటుతూ సాగించిన ఈ సంబరాలు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రిపోర్టర్: గోనె సుధాకర్ రెడ్డి, కాటారం, జయశంకర్ భూపాలపల్లి.....