పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
వికారాబాద్, మేజర్ న్యూస్: పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె చెంగోముల్ పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ నిర్వహణ, పోలీస్ సిబ్బంది విధులు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, లాక్అప్, రైటర్స్ రూమ్తో పాటు వివిధ విభాగాలను పరిశీలించారు. స్టేషన్లో పరిశుభ్రత, క్రమశిక్షణ, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్దేశిత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం వివిధ రికార్డులు, పెండింగ్ కేసుల ఫైళ్లు, దర్యాప్తు పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ICJS, CCTNS వ్యవస్థల్లో కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, డేటా అప్డేషన్లో నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. ఎన్డీపీఎస్ (NDPS) కేసుల్లో నిందితుల వివరాల నమోదు, సాక్ష్యాధారాల సేకరణ, దర్యాప్తు పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల కేసుల్లో ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా దర్యాప్తు చేపట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు.పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను బాధ్యతాయుతంగా స్వీకరించి చట్టప్రకారం పరిష్కరించాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పోలీస్ స్టేషన్లలో పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, కేసుల త్వరిత పరిష్కారం, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పరిగి సీఐ కొండల్ రెడ్డి, చెంగోముల్ ఎస్ఐ భరత్ కుమార్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.