అన్న వదిలిన బాట.. తమ్ముడు మోస్తున్న బాధ్యత
అన్న వదిలిన బాట.. తమ్ముడు మోస్తున్న బాధ్యత
- పువ్వాడి రాధాకృష్ణ ఆశయాలే పువ్వాడి వెంకటేశ్వర్లు రాజకీయ చిరునామా
- వ్యాపారాలను పక్కనపెట్టి పదేళ్లుగా పార్టీతోనే ప్రయాణం
- కార్యకర్తకు కష్టమంటే నేనున్నా అంటూ అండ
- సేవతో సంపాదించుకున్న ‘పువ్వాడి’ కుటుంబం పేరు
- ఇప్పుడు పామూరు ఎంపీపీ అభ్యర్థిగా పువ్వాడి వెంకటేశ్వర్లు
పామూరు, మేజర్ న్యూస్ :
కొందరికి రాజకీయం పదవితో మొదలవుతుంది. మరికొందరికి బాధ్యతతో మొదలవుతుంది. పువ్వాడి వెంకటేశ్వర్లు రాజకీయ ప్రయాణం మాత్రం అన్న జ్ఞాపకం నుంచి మొదలైన బాధ్యత. తన అన్న, స్వర్గీయ పువ్వాడి రాధాకృష్ణ నమ్మిన సిద్ధాంతాలను నిలబెట్టాలి. ఆయన ప్రేమించిన కార్యకర్తలకు అండగా ఉండాలి. ‘పువ్వాడి’ కుటుంబంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడాలి. ఇదే లక్ష్యంగా దాదాపు పదేళ్లుగా సాగుతున్న పువ్వాడి వెంకటేశ్వర్లు ప్రయాణం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. పామూరు ఎంపీపీ స్థానం ఓసీ జనరల్కు రిజర్వు కావడంతో టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా పువ్వాడి వెంకటేశ్వర్లు పేరు ఖరారైంది.
అన్న లేని లోటు.. బాధ్యతగా మారిన వేళ
పామూరు టీడీపీ రాజకీయాల్లో స్వర్గీయ పువ్వాడి రాధాకృష్ణది ప్రత్యేకమైన అధ్యాయం. మండల అధ్యక్షుడిగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ కార్యకర్తలతో ఆయన ఏర్పరచుకున్న అనుబంధం చెరగనిదని పార్టీ శ్రేణులు గుర్తుచేసుకుంటుంటాయి. ఆయన దూరమైన తర్వాత ఆ కుటుంబానికి ఏర్పడిన లోటుతో పాటు కార్యకర్తల్లోనూ వెలితి నెలకొంది. ఆ సమయంలోనే అన్న ఆశయాలు ఆగకూడదు అన్న సంకల్పంతో వెంకటేశ్వర్లు ముందుకొచ్చారు. అన్న స్థానాన్ని భర్తీ చేయగలననే భావనతో కాకుండా అన్న చూపిన బాటను కొనసాగించాలనే బాధ్యతతో రాజకీయాల్లో అడుగులు వేశారు.
వ్యాపారం కన్నా.. పామూరే ముందైంది
కర్నూలు జిల్లాలో తనకున్న వ్యాపారాలను చూసుకుంటూ వ్యక్తిగత జీవితానికే పరిమితం కావడానికి అవకాశం ఉన్నా పువ్వాడి వెంకటేశ్వర్లు మరో దారిని ఎంచుకున్నారు. సొంత వ్యాపారాలను పక్కన పెట్టి పామూరు మండలంలో పార్టీకి సమయం కేటాయించారు. గ్రామగ్రామాన తిరిగారు. కార్యకర్తలతో మమేకమయ్యారు. పార్టీ కష్టకాలంలోనూ వెనక్కి తగ్గకుండా శ్రేణులకు అందుబాటులో ఉంటూ వచ్చారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
కార్యకర్తకు కష్టమంటే.. ‘నేనున్నా’
నాయకుడి చుట్టూ కార్యకర్తలు తిరగడం రాజకీయాల్లో సహజం కానీ కార్యకర్తకు అవసరం వచ్చినప్పుడు నాయకుడు అతని వద్దకు వెళ్లడమే తన విధానంగా వెంకటేశ్వర్లు ముందుకు సాగుతున్నారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. గ్రామం ఏదైనా కార్యకర్త ఎవరైనా తన దృష్టికి వచ్చిన సమస్యపై స్పందిస్తూ నేనున్నా అనే భరోసా కల్పించడం ఆయనకు శ్రేణులతో అనుబంధాన్ని మరింత పెంచిందంటున్నారు. పదవికంటే పార్టీ, వ్యక్తిగత ప్రయోజనాలకంటే కార్యకర్తలే ముఖ్యమనే విధానంతో ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు.
'పువ్వాడి’ ఇంటిపేరు నుంచి నమ్మకంగా ..
పామూరు మండలంలో ‘పువ్వాడి’ అనే పేరు తమకు కేవలం ఒక కుటుంబం ఇంటిపేరు కాదని ఆ కుటుంబంతో అనుబంధం ఉన్న కార్యకర్తలు చెబుతుంటారు.పువ్వాడి రాధాకృష్ణ కాలం నుంచి సేవ, పార్టీ పట్ల నిబద్ధతతో ఏర్పడిన గుర్తింపును వెంకటేశ్వర్లు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటున్నారు. అన్న సంపాదించిన పేరును తనకు వచ్చిన వారసత్వంగా కాకుండా కాపాడాల్సిన బాధ్యతగా భావించడమే పువ్వాడి వెంకటేశ్వర్ల రాజకీయ ప్రయాణంలో ప్రత్యేకతగా కనిపిస్తోంది.
అన్న ఆశయం నుంచి.. ఎంపీపీ బరివరకు
దాదాపు పదేళ్ల క్రితం అన్న ఆశయాలను కొనసాగించాలనే బాధ్యతతో వేసిన అడుగు ఇప్పుడు పామూరు మండల నాయకత్వం కోసం సాగుతున్న రాజకీయ ప్రయాణంగా మారింది. ఎంపీపీ స్థానం ఓసీ జనరల్కు రిజర్వు కావడం, టీడీపీ అభ్యర్థిగా వెంకటేశ్వర్లు పేరు ఖరారు కావడంతో ఆయన రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది.
అన్న ఇచ్చిన రాజకీయ స్ఫూర్తి పదేళ్లుగా కార్యకర్తలతో పెంచుకున్న అనుబంధం పార్టీపై నిబద్ధత సేవ చేయాలనే తపన ఇవే తన బలంగా పువ్వాడి వెంకటేశ్వర్లు ఎంపీపీ ఎన్నికల బరిలో అడుగుపెడుతున్నారు. అన్న వదిలిన బాటలో మొదలైన తమ్ముడి ప్రయాణం ఇప్పుడు పామూరు మండల పీఠం వైపు సాగుతుంది.