బత్తలపల్లి మండలంలో స్థానిక ఎన్నికల నియమావళి
బత్తలపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి విడుదలైనందున నవంబర్ 14, 2026 నుండి డిసెంబర్ 5, 2026 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని బత్తలపల్లి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అధికారి మరియు డిప్యూటీ ఎంపీడీవో ఎస్. రామమోహన్ నాయుడు తెలిపారు. ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిబంధనలను తప్పక పాటించాలని ఆయన స్పష్టం చేశారు. కుల, మత, ప్రాంతీయ వైషమ్యాలు రేకెత్తించడం మరియు ప్రార్థనా మందిరాలలో ప్రచారం చేయడం పూర్తిగా నిషేధమని, ప్రభుత్వ భవనాలపై జెండాలు, పోస్టర్లు ఏర్పాటు చేయకూడదని చెప్పారు. అలాగే బహిరంగ సభలు, ర్యాలీలు మరియు లౌడ్ స్పీకర్ల వినియోగానికి అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి అని, ఓటర్లకు నగదు, మద్యం లేదా బహుమతులు ఆశచూపడం చట్టరీత్యా తీవ్ర నేరమని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ ఈ నియమాలను పాటించి సహకరించాలని బత్తలపల్లి రిటర్నింగ్ అధికారి శ్రీ నాగ పుల్లమ రావు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు ఎంపీడీవో శ్రీ కృష్ణప్ప మరియు ఎంసీసీ అధికారి శ్రీ ఎస్. రామమోహన్ నాయుడు కోరారు.