telanagana
మంచిర్యాల కలెక్టరేట్లో లిఫ్ట్ మూగబోయింది - ప్రజలకు మెట్లే దిక్కు
సూర్య నస్పూర్ : మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లిఫ్ట్ పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా లిఫ్ట్ మరమ్మతులపై సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన చోటే ఈ పరిస్థితి నెలకొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కలెక్టరేట్లోని మొదటి, రెండో అంతస్తుల్లో పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉండటంతో వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. వీరిలో వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు కూడా ఉండటంతో మెట్లెక్కి కార్యాలయాలకు చేరుకోవడం వారికి కష్టంగా మారింది. ముఖ్యంగా రెండో అంతస్తులోని కార్యాలయాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, నడవడానికి ఇబ్బందిపడే వారు మెట్లు ఎక్కలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన లిఫ్ట్ నిరుపయోగంగా మారడంతో అత్యవసర పనులపై కలెక్టరేట్కు వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు సమస్య తెలిసినా పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లిఫ్ట్కు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.