BREAKING
శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం కర్ణాటకలో ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ: ప్రైవేట్ కళాశాలల ఫీజుల తగ్గింపు 2028 బంగారం ధరలపై ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలు ఈ సంవత్ మార్కెట్లు నేర్పిన 10 ప్రధాన పాఠాలు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన నూతన నూతన ఎంపీటీసీలు.. సుధాకర్, తిమ్మా నాయుడు రాజస్థాన్ బోర్డ్ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటన వైట్‌హౌస్ నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్ ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ని కలసిన జడ్పిటిసి సౌమ్య ఏఐ క్షీణతతో భారత్, చైనా మార్కెట్లకు విదేశీ నిధుల వెల్లువ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత: హోర్ముజ్ వద్ద పేలుళ్లు, అరామ్‌కోపై దాడులు మేడ్చల్ వెస్లీ చర్చిలో ఘనంగా పంట పండుగ వేడుకలు ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గడి ఐసెంకోట్‌కు పిలుపు న్యూజిలాండ్ ఎన్నికల్లో మితవాద కూటమి ఆధిక్యం మూడు విడతల్లో ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: పూర్తి షెడ్యూల్ విడుదల

ఎంపీటీసీ' పోస్టుమార్టం!

Select Suryaa Now
ఎంపీటీసీ' పోస్టుమార్టం!

*టీడీపీ 301...వైసీపీ101
*జనసేన 25, బీజేపీ 2
*కూటమిగా చూస్తే 328
*ఇతరులు 20కలిస్తే 348
*జెడ్పీటీసీ ఓట్లలో కూటమికి 9.48 లక్షల ఆధిక్యం
*ఓట్లున్నా సీట్లు దక్కని వైసీపీ

 

( విజయనగరం బ్యూరో, మేజర్ న్యూస్ )

పరిషత్ ఎన్నికల ఫలితాలు విజయనగరం జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మరోసారి ఆవిష్కరించాయి. అధికార కూటమి తన పట్టును నిరూపించుకోగా, వైఎస్సార్‌సీపీ సైతం గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఫలితం నిరాశాజనకమైంది. ఎంపీటీసీ స్థానాల గెలుపులో టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించగా, జెడ్పీటీసీ ఓట్లలో కూటమి పార్టీల సమష్టి బలం ప్రతిబింబించింది. అయితే టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య నేరుగా పోలిస్తే ఓట్ల వ్యత్యాసం స్వల్పంగా ఉండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

జిల్లాలో మొత్తం 449 ఎంపీటీసీ స్థానాలకు 1,586 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు నిర్వహించారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపు అనంతరం ఆదివారం అర్ధరాత్రి దాటాక ప్రకటించిన తుదిఫలితాలు ఉత్కంఠకు తెరదించాయి. ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 290, ఏకగ్రీవాలు 11తో కలిపి 301.  జనసేన 25, బీజేపీ 2, వైఎస్సార్‌సీపీ 101, ఇతరులు 20 స్థానాలను గెలుచుకున్నారు. మరో 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవాలతో కలిపి కూటమి 317 స్థానాల్లో పాగావేసింది. ఇతరులు కూటమితో కలిస్తే కూటమి బలం 348.


*జెడ్పీటీసీ ఎన్నికల్లో...*
మొత్తం 9,79,848 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీకి 4,19,528, వైఎస్సార్‌సీపీకి 4,13,480 ఓట్లు లభించాయి. జనసేన 72,381, బీజేపీ 16,396 ఓట్లు సాధించాయి. ఇతరులకు 22,133, నోటాకు 6,758 ఓట్లు పడగా, 29,172 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి.

*ఎంపీటీసీల్లో టీడీపీ ఆధిపత్యం*

జిల్లాలోని 449 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 290 స్థానాలను కైవసం చేసుకుంది. అంటే మొత్తం స్థానాల్లో సుమారు 64.6 శాతం స్థానాలు టీడీపీ ఖాతాలో చేరాయి. జనసేన 25 స్థానాలతో తన ఉనికిని చాటుకోగా, బీజేపీ రెండు స్థానాలకు పరిమితమైంది.
వైఎస్సార్‌సీపీ 101 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. ఇతరులు 20 స్థానాల్లో విజయం సాధించారు. 11 స్థానాలు ఏకగ్రీవం కావడం కూడా ఎన్నికల ఫలితాల్లో మరో విశేషం.
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేసిన నేపథ్యంలో ఈ మూడు పార్టీలకు వచ్చిన స్థానాలను కలిపి చూస్తే 317 ఎంపీటీసీ స్థానాలు అవుతాయి. ఇది మొత్తం స్థానాల్లో 70.6 శాతం.

*జెడ్పీటీసీ ఓట్లలో కూటమి సమష్టి బలం*

జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి 4,19,528 ఓట్లు లభించాయి. వైఎస్సార్‌సీపీకి 4,13,480 ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 6,048 మాత్రమే.
అయితే జనసేన, బీజేపీ ఓట్లను కూడా కలిపి చూస్తే కూటమి బలం గణనీయంగా పెరిగింది.

పార్టీ| జెడ్పీటీసీ ఓట్లు| పోలైన ఓట్లలో శాతం
టీడీపీ| 4,19,528| 42.82%
జనసేన| 72,381| 7.39%
బీజేపీ| 16,396| 1.67%
వైఎస్సార్‌సీపీ| 4,13,480| 42.20%
ఇతరులు| 22,133| 2.26%
నోటా| 6,758| 0.69%
చెల్లని ఓట్లు| 29,172| 2.98%
మొత్తం| 9,79,848| 100%

టీడీపీ, జనసేన, బీజేపీలకు కలిపి 5,08,305 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ సాధించిన 4,13,480 ఓట్లతో పోలిస్తే కూటమికి 94,825 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తం పోలైన ఓట్లలో కూటమి పార్టీలకు కలిపి 51.87 శాతం ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీకి 42.20 శాతం ఓట్లు వచ్చాయి.
అయితే కూటమి పార్టీల ఓట్లను సమష్టిగా పరిగణించినప్పుడే ఈ ఆధిక్యం కనిపిస్తుంది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య నేరుగా పోలిస్తే వ్యత్యాసం 6,048 ఓట్లు మాత్రమే ఉండటం గమనార్హం.
*రాజకీయంగా ఏమి చెబుతున్నాయి?*
పరిషత్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే జిల్లాలో టీడీపీ తన సంస్థాగత బలాన్ని ఎంపీటీసీ స్థానాల రూపంలో నిరూపించుకుంది. జనసేన, బీజేపీ ఓట్లు కూడా కూటమికి అదనపు బలంగా నిలిచాయి. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ ఓట్లలో టీడీపీకి అత్యంత సమీపంలో నిలవడం ఆ పార్టీకి ఉన్న ఓటు ఆధారాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య కేవలం 6,048 ఓట్ల వ్యత్యాసం ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
మూడు విభాగాల్లోనూ కూటమి సమష్టి ఓట్ల ఆధిక్యం కనిపించడం, ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ మెజారిటీ సాధించడం కూటమికి అనుకూల పరిణామయితే, వైఎస్సార్‌సీపీకి వచ్చిన ఓట్లను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి ఉంది.
మొత్తంగా పరిషత్ ఎన్నికలు జిల్లాలో కూటమి ఆధిపత్యాన్ని చాటడంతో పాటు, వైఎస్సార్‌సీపీకి కూడా గట్టి రాజకీయ పోటీ సామర్థ్యం ఉందనే సంకేతాలిచ్చాయి.