ఏలూరు జెడ్పీ వైస్ చైర్మన్ పదవి కొయ్యలగూడెం వాసి కే ఇవ్వాలి
కొయ్యలగూడెం రూరల్ , మేజర్ న్యూస్ :వాడపల్లి రమేష్‌కు అవకాశం కల్పించాలని జనసైనికుల డిమాండ్.. ఏలూరు జిల్లా పరిషత్‌లో వైస్ చైర్మన్ పదవి ఎవరికి దక్కనుంది? కొయ్యలగూడెం జెడ్పీటీసీ వాడపల్లి రమేష్‌కు ఆ అవకాశం కల్పిస్తారా? ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంత జనసేన శ్రేణుల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన వాడపల్లి రమేష్‌కు వైస్ చైర్మన్ పదవి కేటాయించాలని పలువురు జనసైనికులు కోరుతున్నారు. జిల్లాలో మొత్తం 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, కొయ్యలగూడెం జెడ్పీటీసీగా పోటీ చేసిన వాడపల్లి రమేష్ 11,728 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థుల్లో రెండో స్థానంలో నిలిచారు. గణపవరం జెడ్పీటీసీ టీడీపీకి చెందిన ఇందుకూరి రామకృష్ణంరాజు 12,527 ఓట్ల మెజారిటీతో మొదటి స్థానంలో నిలిచారు. ఇక జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె పెదవేగి జెడ్పీటీసీ చింతమనేని సాయి నవ్యశ్రీ పేరును పార్టీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ పదవి పోలవరం నియోజకవర్గానికి చెందిన కొయ్యలగూడెం జెడ్పీటీసీ వాడపల్లి రమేష్‌కు కేటాయించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీనికి ప్రధానంగా కొన్ని కారణాలను జనసేన శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దెందులూరు ప్రాంతానికి కేటాయించే అవకాశం ఉండటంతో, వైస్ చైర్మన్ పదవిని పోలవరం నియోజకవర్గానికి ఇవ్వాలనేది వారి ప్రధాన డిమాండ్‌గా కనిపిస్తోంది. మరోవైపు, జిల్లాలో రెండో అత్యధిక మెజారిటీతో వాడపల్లి రమేష్ విజయం సాధించడం కూడా ఆయనకు పదవి కేటాయించాలనే డిమాండ్‌కు బలంగా మారింది. పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఈ సమయంలో రమేష్‌కు వైస్ చైర్మన్ పదవి ఇస్తే పార్టీకి రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా యువ నాయకుడిగా రమేష్‌కు స్థానికంగా నాయకులు, కార్యకర్తల మద్దతు ఉండటం కూడా ఆయనకు కలిసొచ్చే అంశంగా పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలను ఈ నెల 20వ తేదీన నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ఈ పదవుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కావున జనసేన శ్రేణుల ఆశలను పార్టీ అధిష్టానం నెరవేర్చాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.