ఎల్ నినో ప్రభావం పై రైతులకు శిక్షణ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
మర్రిపాడు, మేజర్ న్యూస్ : వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు ప్రణాళికతో ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచించారు. ఈ మేరకు సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మర్రిపాడు మండలంలోని నందవరం గ్రామంలో రైతులకు ప్రత్యేక పూర్వాభ్యాస శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుధాన్యాల సాగు, ఎల్‌నినో ప్రభావం, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర పంటల యాజమాన్యం, జీవన ఎరువులు, జీవ నియంత్రణ కారకాలు, భూమి సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాల నేపథ్యంలో రైతులు నీటి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ జొన్న, మొక్కజొన్న, సజ్జ, శనగ, పెసర, మినుము, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశనగ, రాగి వంటి ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను స్థానిక నేలలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువులు వినియోగించాలని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి రైజోబియం, అజోటోబాక్టర్, అజోస్పిరిల్లం, పీఎస్‌బీ, కేఎస్‌బీ వంటి జీవన ఎరువులను ప్రోత్సహించాలని వివరించారు. అలాగే సేంద్రియ పదార్థాల వినియోగం, మట్టి కోత నివారణ, వర్షపు నీటి సంరక్షణ ద్వారా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పంటలలో చీడపీడలు, తెగుళ్ల నియంత్రణకు ట్రైకోడెర్మా, సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ వంటి జీవ నియంత్రణ కారకాలను వినియోగించాలని, నాణ్యమైన విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, సరైన నీటి యాజమాన్యం, కలుపు నివారణ వంటి సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులను పాటించాలని రైతులకు శిక్షణ ఇచ్చారు.
రైతులు తమ సందేహాలను నిపుణులను అడిగి నివృత్తి చేసుకున్నారు. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తూ సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎన్. కవిత, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు బి. శ్రీనివాస చక్రవర్తి, పి. శ్రీధర్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు సేద్య విభాగ శాస్త్రవేత్త డా. కె. కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.