ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.25 లక్షల విరాళం
పి. గన్నవరం, నవంబర్ 13: పి. గన్నవరం మండలం ఆర్. ఏనుగుపల్లి గ్రామంలో త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు యాండ్ర ఫణీంద్ర కుమార్ (దొరబాబు) సర్పంచ్‌గా పోటీ చేయాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా తన భార్య ను సర్పంచ్ ఎన్నికల బరిలోకి దింపే ఉద్దేశం ఉన్నట్లు ఆయన తెలియజేశారు. గ్రామ ప్రజలందరూ, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి కోసం రూ.25 లక్షలు విరాళంగా అందజేస్తానని ప్రకటించారు. ఈ నిధులతో పాటు, ప్రభుత్వ సహకారంతో గ్రామంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, రైతులకు ఉపయోగపడే పంట కాలువల ఆధునికీకరణ, తాగునీటి సౌకర్యాల మెరుగుదల, పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన చేపడతానని తెలిపారు. అలాగే ప్రజల ఆహ్లాదం కోసం పార్కు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర వినోద సౌకర్యాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలంతా ఐక్యంగా ఉండి ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని దొరబాబు ప్రకటించారు. దీంతో ఆర్. ఏనుగుపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.