డ్రగ్స్ రహిత దేశానికి యువత కృషి చేయాలి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : భావి భారత పౌరులైన విద్యార్థులు మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రిన్సిపాల్ డాక్టర్ సి.నాధముని రెడ్డి పిలుపునిచ్చారు. అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఈగల్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణకు అవగాహన, ముందస్తు నివారణ, చికిత్స, పునరావాసం కీలకమని పేర్కొన్నారు.చెడు వ్యసనాల బారిన పడకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్యాలను వివరిస్తూ, తొలిత దేశంలోని 272 అత్యంత ప్రభావిత జిల్లాల్లో అమలై, 2023 ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. మద్యం, మాదకద్రవ్యాలు, పొగాకు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. 2023 జూలై నాటి అధికారిక గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 29.32 కోట్ల మందికి అవగాహన కల్పించగా, వారిలో 11.2 కోట్ల మంది యువత, 7.92 కోట్ల మంది మహిళలు ఉన్నారని వివరించారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో 21 లక్షలకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఈ-ప్రతిజ్ఞ చేసి, మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈగల్ సెల్ ప్రతినిధులు ఇన్‌స్పెక్టర్ డి.ప్రసాద్, గోవింద్, కామేష్, కమల్ ఫాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ.అనిల్, వివిధ విభాగ అధిపతులు సుమారు 800 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్