మత్తుకు "నో"చెప్పి జీవితాన్ని కాపాడుకోండి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : మత్తు పదార్థాలకు "నో" చెప్పి బానిసలు కాకుండా...ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించి రాబోయే తరాలను కాపాడుకునేలా దిక్సూచిలా నిలవాలని ప్రిన్సిపల్ డాక్టర్ సి భువనేశ్వరి పిలుపునిచ్చారు. పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. శుక్రవారం కళాశాలలో జరిగిన కార్యక్రమానికి తిరుపతి ఈగల్ సెల్ అధికారులు ప్రసాద్, గోవింద్, కమల్, కామేష్ హాజరై ముత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈగల్ సెల్ అధికారులు మాట్లాడుతూ మానవ శరీరానికి తీవ్ర హాని కలిగించే పదార్థాలే డ్రగ్స్ అని, ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యసనమని అన్నారు. ధూమపానం, మద్యపానం కంటే తీవ్రమైన ప్రభావం చూపుతుందని, యువతను చెడు మార్గంలోకి లాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 5.6 శాతం జనాభా అంటే 185 మిలియన్ల మంది డ్రగ్స్ కు బానిసలవుతున్నారని గణాంకాలతో వివరించారు. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, మారిజువానా, కొకైన్, ఎల్.ఎస్.డి. వంటివి నల్లబజారులో సంకేత నామాలతో చలామణి అవుతున్నాయని, వీటి అక్రమ రవాణాతో కొందరు కోట్లు గడిస్తుంటే యువత జీవితాలు నాశనమవుతున్నాయని అన్నారు.
ఒకసారి డ్రగ్స్ కు బానిసలైతే చదువులు, భవిష్యత్తు నాశనమై ఎలాంటి నేరాలకైనా పాల్పడతారని ఉదాహరణలతో వివరించారు. డ్రగ్స్ నిరోధానికి కేంద్ర ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సస్ చట్టం తీసుకొచ్చిందని, పండించినా, అమ్మినా, కలిగి ఉన్నా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
అనంతరం విద్యార్థినుల చేత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఎక్కడైనా అనుమానం వస్తే వెంటనే 1972కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీగల్ క్లబ్ ఇన్చార్జ్ లు పి.రవి కుమార్, క్రిష్ణమూర్తి, డా. జయమ్మ పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్