లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్ట్
జై భవాని
సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలోని అష్టలక్ష్మి దేవాలయం సమీపంలో జై భవాని లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఒక నిందితుడిని జగిత్యాల టౌన్ పోలీసులు అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సిఐ కరుణాకర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం జగిత్యాల సాయిరాం నగర్‌కు చెందిన చింతల రాజేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, జై భవాని లక్కీ డ్రా నిర్వాహకులు ఎలక్ట్రిక్ బైక్‌లు, వన్ గ్రామ్ గోల్డ్ సహా మొత్తం ఎనిమిది బహుమతులు ఇస్తామని ప్రకటించి ఒక్కో కూపన్‌ను రూ.100 చొప్పున విక్రయించారని వెల్లడించారు. ఫిర్యాదుదారుడు రెండు కూపన్లు కొనుగోలు చేయగా, దసరా పండుగ రోజైన అక్టోబర్ 21న లక్కీ డ్రా తీస్తామని నిర్వాహకులు ప్రకటించారని పేర్కొన్నారు. సుమారు 7 వేల కూపన్లు విక్రయించిన నిర్వాహకులు బోడ లక్ష్మీ నరసయ్య, మానపురి కిరణ్ ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా డ్రా తీసి భక్తులను మోసం చేశారని ఫిర్యాదు అందిందన్నారు.