జీవీఎంసీ పోరులో జోరందుకున్న జనసేన ప్రచారం... భారీగా పార్టీలోకి చేరికలు
పెందుర్తి, సూర్య : గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జీవీఎంసీ 114వ వార్డు వరలక్ష్మి నగర్ మెయిన్ రోడ్డు, కృష్ణరాయపురం మరియు 104వ వార్డు చిన్నపాలెం, పెద్దపాలెం ప్రాంతాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 114వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి కోన మోహన్ కుమార్ నాయుడుకు మద్దతుగా ఎమ్మెల్యే గడపగడపకూ వెళ్లి స్థానిక ప్రజలను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పెందుర్తి నియోజకవర్గంలో మొత్తం 9 స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం 104వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి కాకి అప్పల రెడ్డికి మద్దతుగా చినపాలెం, పెద్దపాలెంలలోని మసీదుల వద్ద ముస్లిం పెద్దలు, స్థానిక ప్రజలను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తన హయాంలో ఆయా ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు, రాబోయే మూడేళ్లలో చేపట్టబోయే కార్యక్రమాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ.. ఖాళీ ఖజానాతో అధికారంలోకి వచ్చినప్పటికీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని సమపాళ్లలో నడిపిస్తోందన్నారు. పెందుర్తి నియోజకవర్గానికి భారీగా నిధులు తీసుకువచ్చామని, జీవీఎంసీ పరిధిలో ఒక్కో వార్డుకు 50 కోట్లకు పైగా నిధులు సాధించామని తెలిపారు. రాష్ట్రంలోనూ, స్థానిక సంస్థల్లోనూ ఒకే కూటమి అధికారంలో ఉంటే సమన్వయంతో మరింత వేగంగా అభివృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. అలాగే చినపాలెం, పెద్దపాలెం ముస్లిం మైనారిటీల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదే క్రమంలో నమ్మిదొడ్డి పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వైఎస్సార్సీపీకి చెందిన 50 కుటుంబాలు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బుట్టా సూర్య కుమారి, అప్పికొండ శివాలయం చైర్మన్ పరదేశి, టీడీపీ సీనియర్ నాయకులు పాల అచ్చుల నాయుడు, మంత్రి రవి, కుంచ సరస్వతి, నక్క శ్రీనివాసరావు, షణ్ముఖ శివ తదితర ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ : నారాయణ, పెందుర్తి, విశాఖపట్నం.