డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన లఘుచిత్రం
విజయవాడ క్రైం, మేజర్ న్యూస్ : మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత, కుటుంబాలు, సమాజంపై కలిగే తీవ్ర ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన సామాజిక అవగాహన లఘుచిత్రం ప్రచార చిత్రాన్ని ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఆవిష్కరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం, విద్యార్థుల్లో అవగాహన పెంచడం, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలనే ఉద్దేశంతో లఘుచిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు షేక్ సోను తెలిపారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడితే వ్యక్తి జీవితం, కుటుంబం, సంబంధాలు, భవిష్యత్తుపై పడే ప్రభావాలను వాస్తవ సంఘటనల ఆధారంగా చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలను అరికట్టడం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, సమాజం మొత్తం బాధ్యత అని పేర్కొన్నారు. యువతలో అవగాహన కల్పించేందుకు లఘుచిత్రాన్ని విద్యార్థులకు ప్రదర్శించేందుకు సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత, లఘుచిత్ర దర్శకుడు షేక్ సోను తదితరులు పాల్గొన్నారు.
✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.