తాగునీటి ట్యాంకులో మట్టి..ప్రజల ఆరోగ్యంతో చెలగాటం!
నవాబుపేట సూర్య న్యూస్:ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సిన మిషన్ భగీరథ నీటి సరఫరా వ్యవస్థ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మండల పరిధిలోని రేకుల చౌడాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన వాటర్ ట్యాంకులో దుమ్ము, మట్టి పేరుకుపోయి అపరిశుభ్రంగా మారినట్లు తెలుస్తోంది.ప్రజల దాహార్తిని తీర్చాల్సిన నీటి ట్యాంకు నిర్వహణపై సంబంధిత అధికారులు,సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రజలకు నిత్యం సరఫరా చేసే తాగునీటి ట్యాంకును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ,నిర్వహణపై సరైన పర్యవేక్షణ కొరవడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు నీటి ట్యాంకుల పరిశుభ్రతను పర్యవేక్షించాల్సిన బహుళ ప్రయోజన కార్మికులు (మల్టీపర్పస్ వర్కర్లు)ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.తాగునీరు కలుషితమైతే ప్రజారోగ్యానికి ముప్పు తప్పదు.అపరిశుభ్రమైన నీటిని తాగడం వల్ల గ్రామస్తులు అనారోగ్యానికి గురైతే బాధ్యత ఎవరిది? ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాల్సిన అధికారులు ఈ పరిస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు,మిషన్ భగీరథ సిబ్బంది స్పందించి వాటర్ ట్యాంకును పూర్తిస్థాయిలో శుభ్రం చేయించి,క్రమం తప్పకుండా పరిశుభ్రతను పర్యవేక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం అధికారుల దయాదాక్షిణ్యం కాదు..అది వారి బాధ్యత.