దేవుని కడపలో సర్వభూపాల వాహనంపై కొలువుతీరిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి
కడప ప్రతినిధి, కడప నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై రాజసం ఉట్టిపడేలా కొలువుదీరి భక్తులకు అభయప్రదానం చేశారు. లక్ష్మీ సమేతుడైన ఆ వేంకటేశ్వరుడి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సర్వభూపాల వాహన విశిష్టత:
'సర్వభూపాల' అనగా లోకంలోని రాజులందరికీ రాజు (రాజాధిరాజు) అని అర్థం. ఈ సేవలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలు, కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయని మరియు రాజభయం తొలగిపోతుందని భక్తుల నమ్మకం. ప్రకృతిలోని సర్వ శక్తులు, అష్టదిక్పాలకులు స్వామివారిని తమ భుజస్కంధాలపై మోస్తున్నట్లుగా ఈ వాహన సేవను ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు:
వాహన సేవకు ముందుగా ఆలయంలో ఉదయం నుంచి నవరాత్రి పూజలు, మూల విరాట్ కు విశేష అభిషేకాలు, అర్చనలు, జరిగాయి. సాయంత్రం వేళ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, నవరత్న ఖచ్చిత ఆభరణాలు రంగురంగుల సుగంధ భరిత పుష్పమాలలతో నయమానందకరంగా అలంకరించారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్ఛనాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని సర్వభూపాల వాహనంపై అదేష్టింపజేశారు.
వైభవంగా తిరువీధి ఉత్సవం :
సర్వభూపాల వాహనంపై వేంచేసిన స్వామి వారి ఉత్సవమూర్తి తిరువీధులలో విహరిస్తుండగా భక్తులు కర్పూర హారతులు పట్టి. కొబ్బరికాయలు కొట్టి తమ భక్తిని చాటుకున్నారు. గోవింద నామస్మరణలతో దేవుని కడప పురవీధులు మారుమోగాయి. ఉత్సవం పొడుగున భజన బృందాలు, కీర్తనలు, కోలాటాలు, సాంస్కృత ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి, ఆలయ అధికారులు, అర్చక స్వాములు, స్థానిక ప్రముఖులు, జిల్లా నలు మూలల నుండి తరలివచ్చిన భక్తులు పాల్గొని తరించారు.
కడప ప్రతినిధి, వేణు.