దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర బృందం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
మురుసు తుఫాను ప్రభావంతో గోదావరి జిల్లాలో సంభవించిన నష్టాలను క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు జిల్లాలో పర్యటిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం శనివారం గోపాలపురం మండలంలోని పల్లవరం రైట్ మెయిన్ కెనాల్, బొల్లాల చెరువు ప్రాంతాలను సందర్శించి నష్టాలను పరిశీలించింది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడం, ఎగువ ప్రాంతాల్లోని చిన్న నీటిపారుదల చెరువుల నుంచి భారీగా వరద నీరు ప్రవహించడంతో కాలువలు, చెరువుల పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయని, కొన్ని ప్రాంతాల్లో చెరువు కట్టలు, వంతెనలు కోతకు గురై దెబ్బతిన్నాయని అధికారులు బృందానికి వివరించారు.ఈ సందర్భంగా స్థానిక అధికారులు చూపించిన నష్టపోయిన ప్రాంతాలను బృంద సభ్యులు స్వయంగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. సుమారు 48 గంటల పాటు నిరంతరంగా వరద నీరు ప్రవహించడం, మూడు గంటల వ్యవధిలో సుమారు 30 సెంటీమీటర్ల మేర అత్యధిక వర్షపాతం నమోదవడం వల్ల తీవ్ర స్థాయిలో వరద ఉద్ధృతి ఏర్పడినట్లు అధికారులు వివరించారు. ఎగువ ప్రాంతాల్లోని చిన్న నీటిపారుదల చెరువుల నుంచి వచ్చిన వరద ప్రవాహం కారణంగా నీటి మట్టం పెరిగి చెరువు కట్టలు, కాలువలు దెబ్బతిన్నాయని తెలిపారు. వరద ఉద్ధృతికి పూర్తిగా దెబ్బతిన్న వంతెనలను బృందం పరిశీలించింది. తాత్కాలిక మరమ్మతులకు సుమారు రూ.30 లక్షలు అవసరమవుతాయని, శాశ్వత పునర్నిర్మాణానికి సుమారు రూ.1.50 కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. పరిసర ప్రాంతాల్లో మరో రెండు వంతెనలు కూడా దెబ్బతిన్నాయని తెలియజేయగా, అన్ని వంతెనలకు సంబంధించిన నష్టాలను సమగ్రంగా అంచనా వేసి అంచనాలు, మెమోరాండంలో పొందుపరచాలని కేంద్ర బృందం సూచించింది. శాశ్వత మరమ్మతులు, పునర్నిర్మాణానికి సంబంధించి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, సమగ్ర ప్రతిపాదనలు అందించాలని పేర్కొంది.
ఈ కేంద్ర బృందంలో అలోక్ జవహర్, డిప్యూటీ సెక్రటరీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ; డాక్టర్ ఎస్.వి.ఎస్.పి. శర్మ, శాస్త్రవేత్త, జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ), ఇస్రో, హైదరాబాద్; శ్రీమతి రాఖా రాణి కొల్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్, కేంద్ర జల సంఘం, హైదరాబాద్; శశాంక్ శేఖర్ రాజ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ప్రాంతీయ కార్యాలయం, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, విజయవాడ సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రాష్ట్ర లైజన్ అధికారి శ్రీమతి కౌసర్ బానో పర్యటించారు. పర్యటనలో ఆర్డీవో కె. ఆనందరావు, వ్యవసాయ అధికారి బి. వెంకటేశ్వరరావు, ఉద్యానవన శాఖ అధికారి ఎన్. మల్లికార్జునరావు, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ. దుర్గేష్, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.