హైవేపై మృత్యుపాశంలా మారిన మరమ్మతు వాహనం 20 రోజులుగా పట్టించుకోని అధికారులు
వెల్దుర్తి, మేజర్ న్యూస్:వెల్దుర్తి మండల పరిధిలోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్)పై మరమ్మతులకు గురైన ఒక భారీ వాహనం గత 20 నుండి 30 రోజులుగా అక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.రహదారిపై వాహనం నిలిచిపోయినప్పుడు కనీస భద్రతా చర్యలు (సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు) ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది వాహనాలు రద్దీగా తిరిగే జాతీయ రహదారిపై ఇన్ని రోజులుగా వాహనం అలాగే ఉన్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), పోలీసు అధికారులు స్పందించి వెంటనే ఆ వాహనాన్ని అక్కడి నుంచి తరలించే ఏర్పాటు చేయాలని, రహదారిపై రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.