andhrapradesh
తిరుమల తిరుపతి పాదయాత్ర ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
హిందూపురం : - స్థానిక మున్సిపల్ పరిధిలోని బాలాజీ నగర్ లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి బయలుదేరిన తిరుమల తిరుపతి పాదయాత్రను తాజా మున్సిపల్ చైర్మన్ పి.ఎస్.మంజునాథ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పాదయాత్ర బృందం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి ఆహ్వానం మేరకు మున్సిపల్ చైర్మన్ మంజునాథ్ ఆలయానికి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులకు తోడు దాతలు,భక్తాదులు సహకారంతో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అతి సుందరంగా నిర్మించి నిత్య పూజలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం హర్షించదగ్గ విషయమని మున్సిపల్ చైర్మన్ కొనియాడారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాలు పెంపొందించుకొని సన్మార్గంలో పయ నిస్తే సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో వందలాదిమంది భక్తాదులు కాలినడకన తిరుమలతిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడం చాలా అభినందనీయం అన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ మంజునాథ్ కు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం గోవిందా గోవిందా అనే నామస్మరణంతో బయలుదేరిన తిరుమల తిరుపతి పాదయాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ శేఖర్ గౌడ్, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పి ఆర్ ఆర్ సుబ్రమణ్యం,సెక్రెటరీ ఎస్ బి ఆంజనేయులు, ట్రెజరర్ ఎంఎస్ఎస్ ప్రసాద్, కమిటీ సభ్యులు నామ్ రవి,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం సూర్య స్టాప్ రిపోర్టర్ నాగేంద్ర